Share News

శ్రీలంకలో తెలుగు వారి పురోగతికి సహకరిస్తాం

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:35 AM

శ్రీలంకలో తెలుగు జాతి పురోగతికి తోడ్పాటు అందించడంతోపాటు వారి సామాజిక ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని శ్రీలంక మంత్రి హినీదుమ సునీల్‌...

శ్రీలంకలో తెలుగు వారి పురోగతికి సహకరిస్తాం

  • బుద్ధ పర్యాటకం అభివృద్ధికి నాంది

  • ఇదో చారిత్రక సమావేశం..కలిసి సాగుదాం

  • మండలి బుద్ధప్రసాద్‌ బృందానికి శ్రీలంక మంత్రి హినీదుమ హామీ

  • ‘అహుకుంటిక’లకు తెలుగు నేర్పేందుకు సహకరించాలని మండలి వినతి

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో తెలుగు జాతి పురోగతికి తోడ్పాటు అందించడంతోపాటు వారి సామాజిక ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని శ్రీలంక మంత్రి హినీదుమ సునీల్‌ సెన్వి హామీ ఇచ్చారు. శ్రీలంక- ఇండియా మధ్య బుద్ధ పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందేందుకు ఈ సమావేశం ఒక నాంది అని పేర్కొన్నారు. ఇదో చారిత్రక సమావేశమని, కలిసి ముందుకు సాగుదామన్నారు. శ్రీలంక తెలుగు కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు నాలుగు రోజులుగా శ్రీలంకలో పర్యటిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ తదితరులతో కూడిన బృందం తాజాగా శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి హినీదుమ సునీల్‌ సెన్వితో సమావేశమైంది. శ్రీలంకలో తెలుగు మాట్లాడే సంచార జాతి అహుకుంటికలను కలిసిన సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలతోపాటు తెలుగు ప్రాంతాలు, శ్రీలంకకు ఉన్న వందల ఏళ్ల అనుబంధాన్ని వారు మంత్రికి వివరించారు. తన తల్లి పేరు మీద సింహళ సామ్రాజ్యాన్ని నిర్మించిన విజయ బాహు తెలుగు ప్రాంతానికి చెందిన వారేనని మండలి బుద్ధ ప్రసాద్‌ గుర్తు చేశారు. బుద్ధుడి పవిత్ర దంత దాతువు తీసుకొచ్చిన రాకుమారి హేమమాలి తెలుగు మూలాలు ఉన్న వారేనని వెల్లడించారు. అలాగే, క్యాండీ చివరి రాజు శ్రీ విక్రమ రాజసింహుడు, రాణి వెంకటరంగమ్మ తెలుగు ప్రాంతానికి చెందిన నాయకర్‌ వర్గానికి చెందిన వారని తెలిపారు. ‘‘తమిళులు, తెలుగు వారి సంస్కృతులు వేర్వేరు. శ్రీలంకలోని తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. అహుకుంటికలకు తెలుగు నేర్పేందుకు సహకరించాలి’’ అని కోరారు. శ్రీలంక ప్రభుత్వం అనుమతిస్తే తమ వర్సిటీ తరఫున తెలుగు ఉపాధ్యాయులను పంపి, స్వల్ప కాలిక శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు, రిజిస్ట్రార్‌ హనుమంతరావు తెలిపారు. శ్రీలంకలో అహుకుంటికల మూలాల గురించి తాము గుర్తించిన వివరాలను జర్నలిస్టులు చామర్తి మురళీధర్‌, డీపీ అనురాధ వివరించారు. శ్రీలంక సమూహంలో తెలుగు వారి విలక్షణతను కాపాడేందుకు సహకారం అందించాలని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ లక్ష్మయ్య కోరారు. ఈ సంద్భంగా విజయ భాస్కర్‌ రచించిన ‘దివారియంట్‌ కళింగ’ ఇంగ్లిషు ప్రతిని మంత్రి ఆవిష్కరించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:35 AM