సింగరేణిలో బీఆర్‌ఎస్‌కు ఝలక్!
ABN , Publish Date - May 04 , 2026 | 04:09 AM
సింగరేణిలో బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) చీలిక దిశగా పయనిస్తోంది. ఆ సంఘం నేతలే పోటీగా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చీలిక
కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో కొత్త సంఘం
తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్యగా రిజిస్టర్
నేడు మేడారంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు
కవిత పార్టీకి అనుబంధంగానా? అన్న చర్చ
వరంగల్, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సింగరేణిలో బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) చీలిక దిశగా పయనిస్తోంది. ఆ సంఘం నేతలే పోటీగా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య (టీజీబీఎస్‌కే)గా దీనికి నామకరణం చేశారు. సింగరేణిలో గులాబీ కార్మిక నేతల మధ్య తారస్థాయికి చేరిన విభేదాల వల్లే ఈ కొత్త సంఘం పురుడు పోసుకుంటోందనే చర్చ జరుగుతోంది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పగించటంతో సంఘంలోని ఓ వర్గం ఈ కొత్త సంఘాన్ని తెరపైకి తెస్తోందని అంటున్నారు. టీబీజీకేఎస్ సీనియర్ నేత కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో ఈ సంఘం ఏర్పాటవుతోంది. సోమవారం ములుగు జిల్లా మేడారంలో వన దేవతల సన్నిధిలో, సింగరేణి ప్రాంతంలోని వివిధ డివిజన్లకు చెందిన ముఖ్య నేతల సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏర్పాటును ప్రకటించనున్నారు. ఇప్పటికే జనగామ జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ చిరునామాతో ఈ నెల 17 వరంగల్ నగరంలోని కార్మిక సంఘాల రిజిస్ర్టేషన్ కార్యాలయంలో ఈ-2926 నంబరుతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. వరంగల్‌లో రిజిస్ర్టేషన్ చేయించిన నేతలు సోమవారం మేడారంలో వన దేవతల సన్నిదిలో సభ నిర్వహించి, కెంగర్ల మల్లయ్య ప్రకటన చేయనున్నారు. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్‌కు తొలుత కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు రావడంతో.. ఆమె టీబీజీకేఎస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత ఆమెను పార్టీ దూరం పెట్టింది. గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బీఆర్‌ఎస్ అధిష్ఠానం నియమించింది. అయితే కవితను గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత కార్మిక సంఘం నేతల్లో ఐక్యత కొరవడిందనే చర్చ జరుగుతోంది. దీంతో కార్మిక సంఘం నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్న క్రమంలో కొత్త సంఘం ఏర్పాటుకు కానుండడం బీఆర్‌ఎ్‌సకు భారీ దెబ్బగా భావిస్తున్నారు. కాగా, కల్వకుంట్ల కవిత నూతనంగా తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. సింగరేణిలో కొత్తగా ఏర్పాటవుతున్న కార్మిక సంఘం ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందా? లేక స్వతంత్రంగా వ్యవహరిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.