kumaram bheem asifabad- ఆధ్యాత్మిక సందడి
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:07 PM
లంబాడా (బంజారాల) ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ దీక్షలతో తండాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏటా శివరాత్రి పండగ రోజు మాలలు స్వీకరిస్తారు. శ్రీరామనవమి వరకు 41 రోజుల పాటు సేవాలాల్ దీక్షలు స్వీకరిస్తారు.
- తండాల్లో వెల్లివిరుస్తున్న భక్తి భావం
కెరమెరి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): లంబాడా (బంజారాల) ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ దీక్షలతో తండాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏటా శివరాత్రి పండగ రోజు మాలలు స్వీకరిస్తారు. శ్రీరామనవమి వరకు 41 రోజుల పాటు సేవాలాల్ దీక్షలు స్వీకరిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో దీక్ష భూమి వద్ద మాలలు స్వీకరిస్తారు. దీక్ష సమయంలో మాలధారులతో పాటు ఇంటిల్లిపాది భక్తి భావంతో ఉంటారు. మద్యం, మాంసంకు దూరంగా ఉంటారు. ప్రతీ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. లింగబేధం లేకుండా వీలును బట్టి 41, 21, 11 రోజుల మాలధారణ చేస్తారు. దీక్ష భూమి కొత్తపల్లిలో ప్రారంభమైన దీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్షాట క, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బంజార భక్తులు పాటిస్తున్నారు. చివరి రోజు పౌరాదేవి(మహారాష్ట్ర) నాసిక్ జిల్లాలోని పౌరాదేవి గ్రామంలో కొలువైన జగదాంభదేవి సేవాలాల్ మమారాజ్ సమాధి పౌరగడ్ పీఠాధిపతి బాల బ్రహ్మచారి రామారావు మహరాజ్‌లకు ప్రత్యేక పూజలు చేసి దీక్షలు విరమిస్తారు. దీక్ష గురు ప్రేంసింగ్ మహారాజ్ పీఠం కొత్తపల్లి నుంచి మహారాష్ట్రలోని పౌరదేవి వరకు 350ఏ కిలో మీటర్లు భక్తులు పాదయాత్రగా వెళ్తారు. ఉగాది పండగ రోజు నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీరామనవమికి పౌరదేవి ఆలయానికి చేరుకుంటారు.
- కఠిన నియమాలు..
అయ్యప్ప, శివ, హనుమాన్ దీక్షల మాదిరిగానే సేవాలాల్ దీక్షల్లో కూడా కఠిన నియమాలు ఉంటాయి. మద్యపానం, మాంసాహారం, అబద్ధాలకు దూరంగా సన్మార్గంతో తమను నడిపించేందుకు తమను నడిపించేందుకు దీక్షలు చేపడుతున్నామని భక్తులు చెబుతున్నారు. గులాబీరంగు చొక్కా, తెల్లని ప్యాంటు లేక లుంగీ, గులాబీ కండువా, రుద్రాక్ష మాలను దీక్షలో భాగంగా ధరిస్తారు. దీక్ష సమయంలో ఇళ్లకు దూరంగా ఉంటారు. సూర్యోదయానికి ముం దుగానే లేచి చన్నీటిస్నాన, జగదాంబమాత, సేవా లాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకభుక్తం(ఒక్క పూట భోజనం), భూతల శయనం తదితర కటిన నియామాలను అనుసరిస్తారు. ఉదయం, సాయంత్రం స్నానం, పూజలు తప్పనిసరి. ప్రతి రోజూ రాత్రి అందరూ కలి సి భజన కార్యక్రమం నిర్వహిస్తారు. దీక్షలు ముగిసే వరకు జగదాంబమాత, సేవాలాల్ మందిరాల ముందు గుంతలు తవ్వి, కర్రలతో మంటలు మండిస్తారు. రాగి పాత్రలో రవ్వ, చెక్కర, ఆవునెయ్యి తదితర పదార్ధాలతో పాయసం వండుతారు. అనంతరం పాయసాన్ని అగ్నికి ఆహుతి ఇస్తారు. దీక్షలు తీసుకున్న వారి కుటుంబ సభ్యులు సైతం కఠిన నియామాలు ఆచరి స్తారు. తమ ఇంట్లోనే కాకుండా బంధువుల ఇళ్లకు వెళ్లినా నిబంధనలు పక్కాగా పాటిస్తారు.
దీక్షలతో మార్పు..
- రాందాస్ రాథోడ్, సేవాలాల్ భక్తుడు, అనార్‌పల్లి
సేవాలాల్ దీక్షలతో యువతలో మార్పు కనిపిస్తోం ది.. భక్తి భావం, ఏకతాభావం పెరుగుతోంది. దీక్షలతో సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాల వారికి అందిం చగలుగుతాం. దీక్షలు తీసుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. యువత వ్యసనాల బారిన పడి తమ ఆరోగ్యంతో పాటు కుటుంబ పరిస్థితిని చిన్నా భిన్నం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి విరుగుడుగా సేవాలాల్ దీక్షలు పని చేస్తున్నాయి. ఇది శుభపరిణా మం.