Share News

డిప్యూటీ సీఎం చాంబర్‌ ముందు ఎవరూ నడవకూడదట

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:56 AM

రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్‌ పోలీసులు అమలుచేస్తున్న ఆంక్షలు అటు ప్రజలను, ఇటు అధికారులను కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

డిప్యూటీ సీఎం చాంబర్‌ ముందు ఎవరూ నడవకూడదట

  • సచివాలయంలో ఎస్పీఎఫ్‌ పోలీసుల కొత్త ఆంక్షలు

  • వారికి పైరవీలే తప్ప భద్రత ముఖ్యం కాదని విమర్శలు

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్‌ పోలీసులు అమలుచేస్తున్న ఆంక్షలు అటు ప్రజలను, ఇటు అధికారులను కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిప్యూటీ సీఎం చాంబర్‌ ముందు నుంచి అధికారులతో సహా ఎవరూ నడవకూడదని చెబుతూ ఆ దారిలో ఎవరినీ అనుమతించడం లేదు. కార్యాలయంలో డిప్యూటీ సీఎం లేకపోయినా ఆంక్షలు వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎస్పీఎఫ్‌ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు కీలక శాఖల వద్ద ఫైళ్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేయడం తప్ప భద్రత గురించి పెద్దగా పట్టించుకోరనే విమర్శలు కూడా ఉన్నాయి. చాంబర్‌కు వేళ్లే దారిలో ఇప్పటికే చెక్‌ పాయింట్‌ పెట్టిన ఎస్పీఎఫ్‌ పోలీసులు.. మంత్రి వివేక్‌ విలేకరుల సమావేశానికి వెళ్లే జర్నలిస్టులను సైతం సోమవారం అనుమతించలేదు. ఇటీవల రెవెన్యూ శాఖలో సహాయ కార్యదర్శి హోదాలో ఉన్న ఓ అధికారిని కూడా గేటు బయట ఉన్న కానిస్టేబుల్‌.. నోటితో ఈలలు వేస్తూ.. చిత్ర విచిత్ర సంజ్ఞలు చేయడంతో పాటు ఐడీ కార్డు చూపుకుండా ఎక్కడికి పోతున్నావంటూ.. ఏకవచనంతో సంబోధించడంతో ఆ అధికారి సచివాలయ ముఖ్య భద్రతాధికారికి (సీఎ్‌సవో) ఫిర్యాదు చేశారు. సదరు కానిస్టేబుల్‌ను పిలిపించి.. క్షమాపణలు చెప్పించి వదిలేశారు. ఈ తరహా సంఘటనలు నిత్యం ఏదో ఒక గేటు వద్ద జరుగుతూనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. సందర్శకుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం, వారికి నచ్చిన వారిని ఏలాంటి తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించడం వంటివి సాధారణంగా జరిగిపోతున్నాయని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు నిజాయితీగా పనిచేస్తున్న తోటి ఎస్పీఎఫ్‌ ఉద్యోగిని కూడా వారు వేధింపులకు గురిచేయడంతో ఆయన.. ఆ వేధింపులు తట్టుకోలేక 9 ఏళ్ల సర్వీసు మిగిలుండగానే ఇటీవల పదవీ విరమణ చేశారు. బలవంతంగా ఆయనతో పదవీ విరమణ చేయించడం సచివాలయ ఉద్యోగుల్లో చర్చనీయాంశమయింది.

Updated Date - Jun 09 , 2026 | 04:56 AM