ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కో-ఆర్డినేటర్‌గా సుదర్శన్‌రెడ్డి?
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:49 AM
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పనుల్లో వేగం పెంచేందుకు, ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సమన్వయం చేసేందుకు వీలుగా ప్రత్యేక కో- ఆర్డినేటర్‌ను నియమించనుంది.
నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పనుల్లో వేగం పెంచేందుకు, ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సమన్వయం చేసేందుకు వీలుగా ప్రత్యేక కో- ఆర్డినేటర్‌ను నియమించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కో-ఆర్డినేటర్‌గా నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం రేవంత్ బుధవారం సమీక్షించారు. భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నాయన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంటనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూడాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టిన తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరపున ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం, బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కో- ఆర్డినేటర్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. సుదర్శన్ రెడ్డిని నియమించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
గుర్రంగూడ ఎకో పార్కులో నేడు వనమహోత్సవం
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏడాది వనమహోత్సవ కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. నాగలింగ మొక్కను నాటి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. వనమహోత్సవం-2026కు అటవీ శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా, గుర్రంగూడ ఎకో పార్కులో రూ.11.57 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను రేవంత్ ప్రారంభించనున్నారు. అదనంగా రూ.6.27 కోట్లతో ఇక్కడ పర్యావరణ పరిరక్షణ పనులు చేపట్టనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17.66 కోట్లతో అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.