Share News

చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:16 AM

రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలు చేపడుతున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను కోరారు.

చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి

  • విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామ్యం అవసరం

  • సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధపై మరింత దృష్టి

  • ప్రభుత్వంతో సమన్వయానికి ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ ఉండాలి

  • సునీల్‌ మిట్టల్‌కు సీఎం రేవంత్‌ సూచన

  • బోధి పెవిలియన్‌లో ఇరువురి భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలు చేపడుతున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను కోరారు. చందన్‌వెల్లిలో నెలకొల్పుతున్న డేటా సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలని కోరారు. సునీల్‌ మిట్టల్‌ మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలను మిట్టల్‌కు సీఎం వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా మారుస్తున్నామని, పాలిటెక్నిక్‌ కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. చందన్‌వెల్లి డేటా సెంటర్‌ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని మిట్టల్‌కు సూచించారు. తెలంగాణలో మరింత సమగ్ర డేటా సెంటర్‌, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంప్‌సను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఏఐ) కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కోరారు. పెట్టుబడి అవకాశాలు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమించుకుని సమన్వయం చేసుకోవాలని సూచించారు. సునీల్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీలలో చదువుకునే విద్యార్థులకు భారతీ పౌండేషన్‌ ద్వారా స్కాలర్‌షి్‌పలను అందజేస్తామని చెప్పారు. ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్‌ క్వార్టర్‌లా హైదరాబాద్‌ను చూస్తున్నామని చెప్పారు. డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచడానికి ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. ఫైబర్‌ కనెక్టివిటీని మరింత పెంచడంపై ఆసక్తిని కనబర్చారు.

Updated Date - Jul 01 , 2026 | 07:18 AM