Share News

Speculation on KCR: నేటి సమావేశాలకు సారొస్తారా?

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:40 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు వస్తారా? రారా? గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ఈ చర్చ కొనసాగుతూనే ఉంది.

Speculation on KCR: నేటి సమావేశాలకు సారొస్తారా?

  • కేసీఆర్‌ రాకపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు వస్తారా? రారా? గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. గత నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్‌.. కేవలం 7 నిమిషాలే సభలో ఉన్న సంగతి తెలిసిందే. మెరుపులా వచ్చి వెళ్లిపోయిన ఆయన.. శుక్రవారం నుంచి జరిగే సమావేశాలకు వస్తారా? లేదా? అన్నది మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ హాజరుపై బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గత నెల 29న సభకు హాజరైన కేసీఆర్‌ ఆ తర్వాత మూడు రోజులపాటు నందినగర్‌ నివాసంలోనే ఉండి పార్టీ శ్రేణులను కలిశారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. దీంతో ఆయన మళ్లీ హైదరాబాద్‌ రారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పీపీటీ ఇస్తే.. అందుకు సమాధానం ఇచ్చేందుకు తమ అధినేత వస్తారని ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు చెబుతున్నారు. ప్రాజెక్టులు, నదీ జలాలపై ఏ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్‌ నేతలు సభలో ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేందుకు కేసీఆర్‌ రానక్కర్లేదని, సీనియర్‌ నేతలే దీటైన సమాధానం చెప్పగలరని మరికొందరు అంటున్నారు.

పీపీటీకి సిద్ధమవుతున్న హరీశ్‌!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, కాంగ్రెస్‌ గత ప్రభుత్వాల నుంచి నేటి వరకు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సభా ముఖంగా ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఆధారాలతో సహా సిద్ధం చేసి ఉంచుకున్నారని, పీపీటీకి అవకాశం ఇస్తే.. కాంగ్రెస్‌ బండారాన్ని బయట పెడతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై చర్చిద్దామని అధికార పార్టీ నేతలు సవాల్‌ విసిరిన నేపథ్యంలో గట్టిగా సమాధానం చెప్పేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.

Updated Date - Jan 02 , 2026 | 04:40 AM