Sankranti Travel: సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేలా..
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:43 AM
సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లే వాహనదారుల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రత్యేక చర్యలు
తాత్కాలికంగా యూటర్న్‌ల మూసివేత
సూర్యాపేట క్రైం/కేతేపల్లి/చౌటుప్పల్ టౌన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లే వాహనదారుల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో 160 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారిపై పండగ వేళ రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. నిత్యం 25 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ హైవేపై పండగ సమయంలో 10 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సారి అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. యూటర్న్‌లను మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల పెట్రోలింగ్, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు. పండగ సందర్భంగా 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. జాతీయ రహదారిపై 10 క్రేన్లు, అంబులెన్స్‌లు సిద్ధం చేశారు.
మొరాయిస్తున్న స్కానర్లు.. వాహనాల బారులు
టోల్‌ప్లాజాల వద్ద స్కానర్లు మొరాయిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజాలో ఫాస్టాగ్ స్కానర్లు, రీడర్లు సకాలంలో పనిచేయకపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. ఆయా కౌంటర్లను దాటేందుకు ఒక్కో వాహనదారుడు నిమిషం నుంచి నాలుగు నిమిషాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.