kumaram bheem asifabad-ప్రత్యేక నిధులు.. గిరి అభివృద్ధికి బాటలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:23 PM
గిరిజన జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతాలపై ప్రభుత్వాలు దృష్టి సారించడంతో పల్లే వాసుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరనున్నాయి. గిరిజనులు సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
జైనూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతాలపై ప్రభుత్వాలు దృష్టి సారించడంతో పల్లే వాసుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరనున్నాయి. గిరిజనులు సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మన్యంలోని మారుమూల గ్రామాల్లో జీవనం సాగిస్తున్న గిరిజన ప్రజలకు ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామీణ యోజన పరంగా మారనుంది. విజన్ 2030పై దృష్టిలో పెటుకున్న కేంద్ర ప్రభుత్వం గిరి పల్లెల్లో మౌలిక వసతులను కల్పించి ఆదర్శ గ్రామాలుగా మార్చడానికి కృషి చేస్తోంది. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ గ్రామీణ యోజన కింద ఏజెన్సీ మండలాల్లోని గిరి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 4 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద 20 గిరిజన గ్రామ పంచాయతీల్లో వివిధ సదుపాయాలు కల్పించనున్నారు.
- పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా
పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ జిల్లాలోని ఏజేన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలు ఇప్పటికీ లక్ష్యానికి సుదూరంలో ఉంటున్నాయి. కనీస మౌలిక వసతులైన విద్య, వైద్యం, రహదారులు, తాగు నీరు వంటివి లేక గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఏటా వర్షాకాలం వస్తే వాగులపై వంతెనలు, కల్వర్టులు సరైన దారులు లేక ఇబ్బందులు పడుతుండగా ఎండా కాలంలో తాగు నీటి సమస్యలతో సతమత మవుతుంటారు. ఇప్పటికే గిరిజనులకు మంజూరైన ఆయా పథకాలకు తోడు ప్రధాన మంత్రి ఆది ఆదర్శ గ్రామీణ యోజనను తీసుకొచ్చిన కేంద్రం ఐదు మండలాల్లోని 20 గ్రామాలను ఎంపిక చేసింది. ఒక్కో దానికి రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 4 కోట్లు మంజూరు చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణం, వాగులు, వంకలు, కాలువలపై కల్వర్టుల నిర్మాణాలు. తాగు నీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. వీటితో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్లెల్లో వెలుగులు రానున్నాయి.
- మండలాల వారీగా ఇలా..
జైనూర్ మండలంలోని జండాగూడ, గూడామామడ, అడ్డెసర్, భూసిమెట్ట, రాసిమెట్ట, లేండిగూడ, శివనూర్, పొలాస ఉన్నాయి. సిర్పూర్(యు) మండలంలోని బాబ్జిపేట్, సీతాగొంది, పంగిడి, భూర్నూర్, నేట్నూర్, కెరమెరి మండలంలో శంకర్‌గూడ, బోరిలాల్‌గూడ, అనార్‌పల్లి, సాకడను ఎంపిక చేశారు. లింగాపూర్ మండలంలో వంకమద్ది, మామిడపల్లి, వాంకిడిలో గుంజాల(పాటగూడ), చౌపన్‌గూడ గ్రామాలు ప్రధానమంత్రి ఆది ఆదర్శ పథకం కింద ఎంపి కయ్యాయి. మౌలిక వసతుల పనులు పూర్తయితే ప్రజలు అవస్థలు తీరనున్నాయి.