ప్రభుత్వ విద్యాలయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:10 AM
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల నిర్వహణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో
సిరిసిల్ల అర్బన్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల నిర్వహణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ , కేజీబీవీ, డీసీవోలు, ఈఎంఅ ర్‌ఎస్ భాధ్యులు, పంచాయితీ రాజ్ ఈఈ, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం భోజనం, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, కావాల్సిన మౌలిక సదుపాయాలు, తరగతి, వసతి గదుల నిర్మాణం, టాస్క్‌ఫోర్స్ టీంల తనిఖీ నివేదికపై చర్చించి.. తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆద్వర్యంలో జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం 19 అదనపు తరగతి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ పంచాయితీరాజ్ ఈఈ, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు, టాయిలెట్స్, ప్రహరీ ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని సూచించారు. అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని స్పష్టం చేశారు. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ప్రతి రెసిడెన్షియల్ విద్యాలయాల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థల్లో ఫ్యాన్లు లైట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా విద్యాధికారి విజయ సాగర్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, పీఆర్‌ఈఈ సుదర్శన్ రెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐ డీ సీ ఈఈ రామకృష్ణ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కేజీబీవీ డీసీవోలు తదితరులు పాల్గొన్నారు.