దానంపై అనర్హత పిటిషన్‌పై..స్పీకర్ విచారణ పూర్తి
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:15 AM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత విధించాలని వేసిన పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం విచారణ జరిపారు.
పిటిషనర్లు కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హాజరు
నేడు కడియంపై అనర్హత పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్, పిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత విధించాలని వేసిన పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలతో స్పీకర్ వేర్వేరు సమయాల్లో భేటీ అయి విచారణ జరిపారు. ఈ విచారణకు తమ న్యాయవాదితో కలిసి హాజరైన పిటిషనర్లు.. తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్‌కు సమర్పించారు. వారి వద్ద వివరాలను సేకరించిన స్పీకర్.. దానం నాగేందర్, ఆయన తరఫు న్యాయవాదిని పిలిపించి మరోరోజు విచారణ జరపనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గురువారం విచారణ జరపనున్నారు. ఇందుకుగాను ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచిస్తూ.. పిటిషనర్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసును పంపారు. కాగా.. ఆయన తన న్యాయవాదితో కలిసి నేడు విచారణకు హాజరుకానున్నారు.
దానంపై అనర్హత వేటు తప్పదు: కౌశిక్‌రెడ్డి
ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక తప్పదని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో దానం కప్పుకున్న కండువాపై చేతిగుర్తు లేదుకదా అని తనను ప్రశ్నించారని, మూడు రంగుల కండువా కాంగ్రె్‌సదేనని తాను చెప్పానన్నారు దానం కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారని, ఏఐసీసీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో దానం నాగేందర్ పేరు ఉన్న ఆధారాలను స్పీకర్‌కు అందించానని ఆయన వెల్లడించారు.