కోరినప్పుడల్లా మైక్ ఇవ్వడం సాధ్యం కాదు
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:08 AM
బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా నాయకుడిగా ఎన్నికయ్యేందుకు హరీశ్ రావుకు అన్ని అర్హతలు ఉన్నాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
స్పీకర్‌ను నియంత్రించాలని చూడడం తగదు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా నాయకుడిగా ఎన్నికయ్యేందుకు హరీశ్ రావుకు అన్ని అర్హతలు ఉన్నాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ పదవికి వారు సమర్థులని కితాబిచ్చారు. అయితే డిప్యూటీ లీడర్‌గా ఆయన కోరినప్పుడల్లా మైక్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. శాసన సభ పార్టీ నాయకుని స్థానంలో కూర్చుంటే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో మంత్రులు బిల్లులు పెట్టే సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. వారు సభ్యులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘స్పీకర్‌ను నియంత్రించే విధంగా.. మేం చెప్తే వినాలి... ఈ విధంగా చేయాలి... అనేలా సభను ఎలా నడపాలో ఆయనకు డిక్టేట్ చేయాలని బీఆర్‌ఎస్ సభ్యులు చూడటం మంచి పద్ధతి కాదు.’’ అని హితవు పలికారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారని, ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎలా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.