Share News

షావుకారు జానకి మరణం.. సినీ ప్రముఖుల నివాళులు..

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:16 PM

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా షావుకారు జానకికి నివాళులు అర్పిస్తున్నారు.

షావుకారు జానకి మరణం.. సినీ ప్రముఖుల నివాళులు..
Sowcar Janaki

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా షావుకారు జానకికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


షావుకారు జానకి సేవలు చిరస్మరణీయం: చిరంజీవి

షావుకారు జానకి మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అన్నారు.


ఆ పాత్రలు ఎప్పటికీ జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి: జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘తెలుగు, భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. జానకి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.


తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందిస్తూ.. ‘తన అద్వితీయమైన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి అనారోగ్యంతో కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురిచేసింది. చిత్ర పరిశ్రమలో 70 ఏళ్లకు పైగా ప్రయాణించి, లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళా సేవ ఎల్లప్పుడూ కొనియాడదగినది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషా చిత్రాలలో నటించి రికార్డు సృష్టించడంతో పాటు.. పద్మశ్రీ, కలైమామణి, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలను అందుకున్న షావుకారు జానకి మరణం సినీ రంగానికి తీరని లోటు’ అని అన్నారు.


మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తూ.. ‘లెజెండరీ నటి షావుకారు జానకి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె హుందాతనం, గౌరవం, అద్భుతమైన నటనా ప్రస్థానం తరతరాలకూ నిలిచి ఉంటాయి. నేటి యువత ఆమె ఎంతటి గొప్ప మహోన్నతమైన వ్యక్తో తప్పకుండా తెలుసుకోవాలి. ఆమె కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని రాసుకొచ్చారు.

Updated Date - Aug 21 , 2026 | 04:47 PM