10న తెలంగాణకు ‘నైరుతి’!
ABN , Publish Date - May 31 , 2026 | 05:48 AM
నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో తెలంగాణను తాకనున్నాయి. జూన్ 10-12 తేదీల మధ్య రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాలుగైదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్/విశాఖపట్నం, మే 30(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో తెలంగాణను తాకనున్నాయి. జూన్ 10-12 తేదీల మధ్య రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ప్రస్తుతం కేరళ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో రెండు మూడు రోజుల్లో గాలుల దిశ మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి అనుగుణంగానే శనివారం అరేబియా సముద్రం, లక్ష దీవులు, కొమోరిన్ ప్రాంతం, తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉండే ఈశాన్య బంగాళాఖాతం వరకు పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఇదిలావుండగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. భూమధ్య రేఖ దాటి హిందూ మహాసముద్రంలోకి రుతుపవన మేఘాల రాక మొదలైంది. దీంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు వరుసగా రెండు రోజుల నుంచి రుతుపవనాలు విస్తరించాయి. ఈ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న వాతావరణ శాఖ, వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళ, తమిళనాడుకు రుతుపవనాలు రానున్నాయని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు 36-38డిగ్రీలకు తగ్గుతాయని, మిగతా జిల్లాల్లో 40-42డిగ్రీల మధ్య నమోదవుతాయని, వడగాల్పుల తీవ్రత తగ్గుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. జూన్ 5 తర్వాత రాష్ట్రమంతా సగటు పగటిపూట ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.