చార్జీల భారం భరించలేం!
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:59 AM
తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు సరఫరా చేసే విద్యుత్‌కు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయని.. వాటిని తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ఈఆర్‌సీకి దక్షిణ మధ్య రైల్వే, ఎన్‌హెచ్‌ఏ మొర
ఇతర రాష్ట్రాలకంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
డిస్కంల ఏఆర్‌ఆర్‌పై పలు రంగాల
నిపుణుల సూచనలు, అభ్యంతరాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు సరఫరా చేసే విద్యుత్‌కు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయని.. వాటిని తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఒడిశాలో యూనిట్ విద్యుత్‌కు రూ.6.29, కేరళలో రూ.5.79, బిహార్‌లో రూ.6.32 వరకు చార్జీలు ఉండగా, తెలంగాణలో యూనిట్‌కు రూ.7.03 చెల్లిస్తున్నామని తెలిపింది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు రూ.5.80 వ్యయం అవుతుండగా.. దానిని 21శాతం పెంచి రూ.7.03 వసూలు చేయడం తగదని పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరగా.. పలువురు తమ సూచనలు, అభ్యంతరాలు సమర్పించారు. 2026-27లో ఒక కేవీఏ (కిలోవాట్ ఆంపియర్)కు రూ.500, ఇంధన చార్జీల కింద యూనిట్‌కు రూ.5.05 ప్రతిపాదించారని, ఈ మొత్తం కలిపితే యూనిట్‌కు రూ.7.03 అవుతుందని (ఇప్పటికే ఈ చార్జీ వసూలు చేస్తున్నారు) దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైలుకు యూనిట్ విద్యుత్ రూ.6.93కు సరఫరా చేస్తుండగా, తమ వద్ద రూ.7.03వసూలు చేయటం సబబు కాదని పేర్కొంది. కాగా, జాతీయ రహదారులపై ఉన్న వీధి దీపాల విద్యుత్ కనెక్షన్ ఎల్‌టీ(లో టెన్షన్)-6(బీ) క్యాటగిరీలో ఉండటంతో ఒక యూనిట్‌కు రూ.11చెల్లించాల్సి వస్తోందని, దీనిని ఎల్‌టీ-6(ఏ) క్యాటగిరీలోకి మార్చాలని జాతీయ రహదారుల సంస్థ కోరింది.
ఆదాయ, వ్యయాల లోటు ఎలా భర్తీ చేస్తారు?
డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య 30 శాతం లోటు ఉందని, విద్యుత్ చార్జీలు పెంచకుండా దీనిని ఎలా భర్తీ చేస్తారని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాలరావు ప్రశ్నించారు. లోటును భర్తీ చేయడానికి తీసుకునే చర్యలను డిస్కంలు ఎక్కడా ప్రతిపాదించలేదని విమర్శించారు. రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి డిస్కంలు సహేతుక చర్యలు తీసుకోలేదని వివిధ రంగాలకు చెందిన విజయభాస్కర్, శ్రీధర్‌రెడ్డి, దొమరు రామ్, శ్రీరంగారావులు విమర్శించారు. విద్యుత్ సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకునేలా డిస్కంలకు ఆదేశాలివ్వాలని తెలంగాణ సోలార్ ఓపెన్ యాక్సెస్ డెవలపర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కొత్త డిస్కం ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నట్లు డిస్కంల అధికారులు తెలిపారు. సరైన సమయంలో ఇందుకోసం దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు.