ఇంటివద్దే పార్సిల్ బుకింగ్, డెలివరీ సేవలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:05 AM
రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఇంటి వద్దనేపార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్ పార్సిల్ యాప్’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి.....
రేపు రైల్ పార్సిల్ యాప్‌ను ఆవిష్కరించనున్న దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఇంటి వద్దనేపార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్ పార్సిల్ యాప్’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. భారతీయ రైల్వేలో మొట్టమొదటగా ఈ పైలెట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఈ నెల 25న సికింద్రాబాద్ రైల్ నిలయంలో ‘రైల్ పార్సిల్ లాజిస్టిక్స్’పై ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ రైల్ పార్సిల్ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-బెంగళూరుతో అవగాహన ఒప్పందంపై దక్షిణ మధ్య రైల్వే సంతకం చేయనుంది. కాగా రైల్ పార్సిల్ యాప్.. ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను అనుసంధానించే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాం. ఇది పార్సిల్ కదలికలను సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్ సరుకులను బుకింగ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వన్-స్టా్‌ప వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. పరిశ్రమ, వ్యక్తులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి దీనిని రూపొందించారు.
యాప్ ఫీచర్లు..
ఆన్‌లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు
రైల్వే పార్సిల్ వాస్తవ రవాణా స్థితిని తెలుసుకోవచ్చు
ఇంటి వద్దే పికప్ నుంచి డెలివరీ వరకు సర్వీస్
పార్సిల్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన ప్రతి దశలో కస్లమర్ల మొబైల్ నంబరుకు సందేశాలు