కొత్త స్వరూపంలో దక్షిణమధ్య రైల్వే
ABN , Publish Date - May 29 , 2026 | 04:02 AM
రైళ్ల నిర్వహణ, ఆదాయ సముపార్జనలో భారతీయ రైల్వేలో మూడోస్థానంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ స్వరూపం జూన్ 1 నుంచి మారనుంది.
జూన్ 1 నుంచి మారనున్న జోన్ పరిధి
సౌత్‌కోస్టల్ జోన్ లోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు
దక్షిణమధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లే
పునర్వ్యవస్థీకరణ తర్వాత దక్షిణమధ్య రైల్వే పరిధి 3,603 కిలోమీటర్లు
హైదరాబాద్ సిటీ, మే28 (ఆంధ్రజ్యోతి): రైళ్ల నిర్వహణ, ఆదాయ సముపార్జనలో భారతీయ రైల్వేలో మూడోస్థానంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ స్వరూపం జూన్ 1 నుంచి మారనుంది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే నుంచి కొన్ని, దక్షిణమధ్య రైల్వే నుంచి కొన్ని డివిజన్లను కలిపి కొత్తగా సౌత్‌కోస్టల్ రైల్వే జోన్ ను రైల్వేశాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన కొత్త రైల్వేజోన్‌లో పరిపాలన ప్రక్రియ జూన్ 1నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. రైల్వేలైన్లు, డివిజన్లు, సెక్షన్లు, సిబ్బంది తదితర విభాగాల్లో విభజన ప్రక్రియను తాజాగా పూర్తిచేశారు. దక్షిణమధ్య రైల్వే జోన్‌లోని గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను సౌత్‌కోస్టల్ జోన్‌లో కలిపారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే నుంచి విశాఖపట్నం డివిజన్‌ను జతచేశారు. దీంతో జూన్ 1 నుంచి దక్షిణమధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ జోన్లు మాత్రమే ఉంటాయి.
సగం తగ్గనున్న నెట్‌వర్క్
ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో 6,645 కిలోమీటర్ల అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉంది. విభజన తర్వాత 3,603 కిలోమీటర్లకు తగ్గుతుంది. అయినా, కొత్తగా ఏర్పడిన సౌత్‌కోస్టల్ రైల్వేకు ఉన్న 3,501 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో పోల్చితే దక్షిణమధ్య రైల్వేనే పెద్దజోన్‌గా ఉంటుంది. రైళ్ల నిర్వహణ, పరిపాలనా సౌలభ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్‌లోని 46 కిలోమీటర్ల కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌లో కలిపారు. అలాగే గుంతకల్లు డివిజన్‌లోని వాడి-రాయచూర్ సెక్షన్‌లోని 108 కిలోమీటర్ల లైన్ సికింద్రాబాద్ డివిజన్‌లో కలిసింది. గుంటూరు డివిజన్‌లో ఉన్న పగిడిపల్లి-విష్ణుపురం-జాన్‌పహాడ్ సెక్షన్‌లోని 142 కిలోమీటర్ల లైన్ సికింద్రాబాద్ డివిజన్‌లో కలిసింది. కొత్తగా నిర్మించిన గుండ్లకమ్మ-కనిగిరి లైన్‌ను గుంటూరు డివిజన్‌లో కలిపారు. పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్ డివిజన్‌కు మార్చారు. నాందేడ్ డివిజన్‌లోని లాతూర్-పర్లి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లో, ముద్కేడ్-కర్కేలి సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌లో కలిపారు. నెట్‌వర్క్‌పరంగా భారతీయ రైల్వేల్లోని టాప్ 5 డివిజన్లలో సికింద్రాబాద్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. డివిజన్లు, నెట్‌వర్క్ పరంగా విభజన ప్రక్రియ పూర్తయినప్పటికీ, సిబ్బంది (అధికారులు, ఉద్యోగులు)ని ఎక్కడ ఉన్న వారిని అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో నాన్-గెజిటెడ్ అధికారులు 2,900 మంది ఉండగా, కొత్తగా ఏర్పడిన సౌత్‌కోస్టల్ రైల్వే ప్రధాన కార్యాలయంలో (ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌లో) 1,041 మంది ఉన్నారు. గెజిటెడ్ అధికారులు దక్షిణమధ్య రైల్వేలో 234 మంది ఉండగా, సౌత్‌కోస్టల్ రైల్వే జోన్‌కు 59 మంది మాత్రమే ఉన్నారు. కొత్త నియామకాల్లో దక్షిణమధ్య రైల్వేకు 1,941 మంది, సౌత్‌కోస్టల్ రైల్వేకు 1,100 మందిని కేటాయించారు.