దక్షిణమధ్య రైల్వేలో ‘జీపీఆర్’
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:59 AM
రైల్వే ట్రాక్‌లోని నిర్మాణ బలహీనతలను పసిగట్టేందుకు రూపొందించిన కృత్రిమ మేధ ఆధారిత గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ...
అందుబాటులోకి ఏఐ ఆధారిత గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వ్యవస్థ
ఇక రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండానే ట్రాక్‌ల తనిఖీ
హైదరాబాద్ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రైల్వే ట్రాక్‌లోని నిర్మాణ బలహీనతలను పసిగట్టేందుకు రూపొందించిన కృత్రిమ మేధ ఆధారిత గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వ్యవస్థ దక్షిణమధ్య రైల్వే పరిధిలో అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థను రైల్వే శాఖ గతేడాది ప్రవేశపెట్టి, క్రమంగా అన్ని జోన్లకు విస్తరిస్తోంది. అందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తాజాగా జీపీఆర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం సికింద్రాబాద్ నుంచి తాండూర్ వరకు జీపీఆర్ వ్యవస్థను అమర్చిన కోచ్‌లో ప్రయాణించి ట్రాక్ కింది పొరలను స్వయంగా తనిఖీ చేశారు. జీపీఆర్ వ్యవస్థ విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ట్రాక్ కింది పొరలను ఎటువంటి తవ్వకాలు జరపకుండానే (నాన్-డిస్ట్రక్టివ్) స్కాన్ చేస్తుందని, తద్వారా ట్రాక్ భద్రతను అంచనా వేసేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఈ విధానంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ బ్లాక్‌ల అవసరం లేకుండానే ట్రాక్ భద్రతను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించటం ద్వారా రైలు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.