సోనియా, రాహుల్ నాకు దేవుళ్లతో సమానం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:22 AM
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని విమర్శించే ఉద్దేశం తనకు లేదని, 1978లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నప్పట్నుంచీ ఇప్పటివరకు పార్టీలోనే కొనసాగుతున్నానని రాష్ట్ర ప్రణాళికా..
అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడలే
1978 నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నా..
‘నోటీసు’ వెనక్కి తీసుకోండి: చిన్నారెడ్డి
హైదరాబాద్/వనపర్తి/న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధిష్ఠానాన్ని విమర్శించే ఉద్దేశం తనకు లేదని, 1978లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నప్పట్నుంచీ ఇప్పటివరకు పార్టీలోనే కొనసాగుతున్నానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో తాను చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానాన్ని ఉద్దేశించినవి కాదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి జారీ చేసిన నోటీసుకు శనివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ ఉపాధ్యక్షుడు శ్యామ్‌మోహన్‌రావుకు ఆయన లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా, ఇందిరా గాంధీ 1978లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చేరి.. ఇప్పటివరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని వివరించారు. నాటి నుంచి ఏనాడూ కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను పవిత్ర మందిరాలుగా భావిస్తానని తెలిపారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరుల పట్ల తనకు ఎంతో గౌరవం, భక్తిభావం ఉందని.. వారు నాకు దేవుళ్లతో సమానమని తెలిపారు. అలాంటి నేతలకు వ్యతిరేక గా మాట్లాడే ప్రసక్తే లేదని, వారిని విమర్శించే ఆలోచన కూడా తనకు లేద న్నారు. తాను చేసిన ప్రసంగం స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆవేదనకు సంబంధించిందేనని చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో వారి ఆవేదనను వ్యక్తపర్చడం తప్ప ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని.. నోటీసును ఉపసంహరించుకోవాలని మల్లు రవిని కోరారు.
సోనియా, రాహుల్‌కు మేఘారెడ్డి ఫిర్యాదు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలని పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని వారి కార్యాలయాల్లో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మేఘారెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందించారు. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.