విద్వేషరహిత భారతాన్ని నిర్మిద్దాం
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:59 AM
భయం, విద్వేష రహిత భారతదేశ నిర్మాణానికి యువత ముందుకురావాలని ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్ చుక్ పిలుపునిచ్చారు.
యువత నిర్భయంగా ముందుకు రావాలి
తప్పు జరిగితే ప్రధాని అయినా జవాబు చెప్పాల్సిందే
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సోనమ్ వాంగ్ చుక్
ధర్నాచౌక్ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
హైదరాబాద్ సిటీ, జూన్ 14(ఆంధ్రజ్యోతి): భయం, విద్వేష రహిత భారతదేశ నిర్మాణానికి యువత ముందుకురావాలని ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్ చుక్ పిలుపునిచ్చారు. ‘మేరా భారత్ మహాన్’ అనేది ఓ నినాదంగా మిగలకూడదని, మహత్తర భారతదేశాన్ని నిర్మించేందుకు యువత నిర్భయంగా ముందుకు రావాలని అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఆదివారం నిర్వహించిన శాంతియుత నిరసనలో సోనమ్ వాంగ్ చుక్ పాల్గొన్నారు. హైదరాబాద్ నలుమూలల నుంచే కాక జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన యువత ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ధర్నాచౌక్ ‘జై భారత్’, ‘మేరా భారత్ మహాన్’ నినాదాలతో దద్దరిల్లింది. ఈ నిరసనలో పాల్గొన్న యువతను ఉద్దేశించి సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ... భయం, విద్వేష రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని, అదే దేశాభివృద్ధికి నాంది అని పిలుపునిచ్చారు. ద్వేషాన్ని పక్కనబెట్టి అభివృద్ధి, ఐక్యతను భుజానికెత్తుకోవడం వల్లే సింగపూర్ వంటి దేశాలు పురోగతిని సాధించాయన్నారు. దేశ భవిష్యత్తు, విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.
సీజేపీ రాజకీయ పార్టీ కాదు
సీజేపీ అధికారం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ కాదని, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా యువతను జాగృతం చేసేందుకు ప్రారంభమైన ఉద్యమమని సోనమ్‌వాంగ్ చుక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తప్పు జరిగితే సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. పరీక్ష నిర్వహణ లోపాలకే పరిమితం కాకుండా, విద్యావ్యవస్థకు బలమైన పునాది ఏర్పాటు చేసే దిశగా సీజేపీ ఉద్యమం సాగాలని ఆకాంక్షించారు. పాడైన విద్యావ్యవస్థకు మరమ్మతు చేయాలా? లేదా పూర్తిగా మెరుగైన వ్యవస్థను నిర్మించాలా? అనే అంశంపై లోతైన చర్చ జరగాలన్నారు. సీజేపీ చేపట్టిన ఈ నిరసన మరింత పెద్ద ఉద్యమంగా మారకముందే ప్రభుత్వాలు విద్యావ్యవస్థలోని అన్ని విభాగాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని హితవు పలికారు. అదే విధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అడవులను ధ్వంసం చేసి భవనాలు నిర్మించి అదే అభివృద్ధి అని భావించేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలి, నీరు భావితరాలకు అందించడమే అసలైన అభివృద్ధి అని వాంగ్‌చుక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం చేసే శాంతియుత నిరసనలో పాల్గొనడానికి భయపడాల్సిన పరిస్థితులు ఉండడంపై వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వ్యక్తులను వేధింపులకు గురి చేయడం ప్రజాస్వామ్య లక్షణం కాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే చైనా, ఉత్తరకొరియాకు భారత్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. నిర్భయత్వం, ప్రేమతత్వం కలగలసిన దేశాన్ని నిర్మిద్దామంటూ సోనమ్‌వాంగ్‌చుక్ యువతకు పిలుపునిచ్చారు. ఇక, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సీజేపీ ఉద్యమకారులను దేశద్రోహులనడం తగదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి విజేత దహియ అన్నారు. సీజేపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దేశం గమనిస్తోందని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర విద్యాకమిషన్ మాజీ అధ్యక్షుడు ఆకునూరి మురళి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తోపాటు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.