Deputy CM Mallu Bhatti Vikramarka: సోలార్ గ్రామాలు దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:22 AM
తెలంగాణలోని పలు గ్రామాల్లో ఇంటింటా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని అమల్లోకి తీసుకురావడం దేశంలోనే విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బోనకల్/చింతకాని, జవవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పలు గ్రామాల్లో ఇంటింటా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని అమల్లోకి తీసుకురావడం దేశంలోనే విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లోని 81 గ్రామాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. దీనికి రూ.1,380 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. పంటలతో పాటు కరెంటు ద్వారా కూడా ప్రజలకు ఆదాయ మార్గాన్ని సాధించడమే సోలార్ ప్రాజెక్టు ధ్యేయమన్నారు. ఇళ్ల పై ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ అవసరాలకు వాడుకోగా, మిగిలిన కరెంటును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మరోవైపు, చింతకాని మండలం వందనం గ్రామంలో సుమారు రూ.41 కోట్ల అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. 2009లో ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత కొదుమూరు-వందనం లిఫ్ట్ పనులను 2013లో పూర్తి చేసి 2,500 ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2,500 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కొదుమూరు-వందనం లిఫ్ట్ రెండో దశకు శ్రీకారం చుట్టామని భట్టి పేర్కొన్నారు.