సచివాలయంపై సోలార్ వ్యవస్థ ఏదీ?
ABN , Publish Date - May 25 , 2026 | 05:50 AM
రాష్ట్ర సచివాలయం సహా రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైనా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయండి. కరెంటు బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకోండి...
సీఎం రేవంత్ ఆదేశించి ఏడాది కావొస్తున్నా ఒక్క అడుగూ ముందుకుపడని వైనం
విద్యుత్ పొదుపు చర్యల్లో అధికారుల అలసత్వం
ఇతర ప్రభుత్వ కార్యాలయాలదీ ఇదే పరిస్థితి
సచివాలయం విద్యుత్ బిల్లు నెలకు రూ.70 లక్షలు
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర సచివాలయం సహా రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైనా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయండి. కరెంటు బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకోండి’ అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించి దాదాపు ఏడాది కావొస్తోంది. అయినా ఇంతవరకూ సచివాలయం సహా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయ భవనమూ ‘గ్రీన్ బిల్డింగ్’గా మారలేదు. ‘సోలార్’కు మారితే విద్యుత్ బిల్లు రూ.కోట్లలో తగ్గించవచ్చని, ప్రభుత్వ కార్యాలయాలతో మొదలుపెట్టి సౌర విద్యుత్ వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని సీఎం భావన. కానీ అధికారుల అలసత్వంతో ఆ లక్ష్యం కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయానికి ప్రతీ నెలా కరెంటు బిల్లు రూ.70లక్షల మేర వస్తోంది. అంటే ఏడాదికి రూ.8.4కోట్లు. వానాకాలం, శీతాకాలంలో నెలకు రూ.50-60 లక్షల వరకు వస్తుందని తెలుస్తోంది. మొదట సచివాలయం పైకప్పు, లోపలివైపు ఉన్న రోడ్లు, బయట నాలుగువైపులా ఉన్న ప్రధాన మార్గాల దగ్గర సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. సచివాలయం చుట్టూ యూనిపోల్స్ విధానంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, దానికి ప్లాంట్‌ను సచివాలయంపైన కానీ మరో ప్రదేశంలో కానీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కానీ ఇంతవరకూ చర్యలే లేకపోవడం గమనార్హం. సచివాలయం పరిస్థితే ఇలా ఉంటే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోలార్ వ్యవస్థ ఏర్పాటు ఊసే లేదు. సచివాలయంపై సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం లేదని, దాని ఏర్పాటుతో సచివాలయం అందం పోతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారంగా మరోచోట సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి విద్యుత్ అందించే అవకాశం ఉందంటున్నాయి. కానీ ఇంతవరకూ ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.
పార్కింగ్ సౌకర్యం ఏర్పాటులోనూ జాప్యమే..
సచివాలయంలో పడమర గేటు వైపు సోలార్ ప్యానెల్స్‌తో కూడిన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుకు పనులు మొదలైనా వేగంగా జరగడంలేదు. ప్రస్తుతం పార్కింగ్‌కు షెడ్‌లు అందుబాటులో లేకపోవడంతో వాహనాలన్నీ ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు డ్రైవర్లకు, అధికారుల వ్యక్తిగత సిబ్బందికి విశ్రాంతి గదులు లేకపోవడంతో కొందరు వాహనాన్ని ఆన్‌లోనే ఉంచి, ఏసీ వేసుకుంటున్న పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బందులు ఉండగా.. ఆ వాహనాలకు ఇంధనం అధికంగా కావాల్సి వస్తోంది. సచివాలయం నిర్మాణం సమయంలోనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.