Share News

పల్లెల్లో సోలార్‌ కాంతులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:15 AM

ఒకప్పుడు సోలార్‌ లైట్లు వెలిగించాలన్నా, సౌరశక్తితో మోటార్లు నడిపించాలన్నా పెట్టుబడి ఖర్చు చూసి వెనుకడుగు వేసిన గ్రామాల్లో ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది.

పల్లెల్లో సోలార్‌ కాంతులు

  • ఇళ్లకు వెలుగు.. సాగుకు నీరు.. వినియోగదారులే ఉత్పత్తిదారులు.. గ్రిడ్‌కు కరెంట్‌ అమ్మి నెలనెలా ఆదాయం!

  • రైతులకు పీఎం కుసుమ్‌ కింద సబ్సిడీ.. ఏడాదికి రూ. 20వేల లాభం!

  • ఖమ్మం జిల్లా మధిరలో ప్రారంభమవుతున్న యూనిట్లు

ఖమ్మం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒకప్పుడు సోలార్‌ లైట్లు వెలిగించాలన్నా, సౌరశక్తితో మోటార్లు నడిపించాలన్నా పెట్టుబడి ఖర్చు చూసి వెనుకడుగు వేసిన గ్రామాల్లో ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. పెరుగుతున్న థర్మల్‌ విద్యుత్‌ ఖర్చులు, బొగ్గు కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నాయి. ఇందుకోసం ‘మోడల్‌ సోలార్‌ మండల్‌’ కార్యక్రమం కింద పైలెట్‌ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని బోనకల్‌ మండలాలను ఎంపిక చేశాయి. ఇక్కడి గ్రామాల్లో వంద శాతం సబ్సిడీతో ఇళ్లు, వ్యవసాయ మోటార్లకు సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పల్లెల్లో సౌరకాంతులు నిండడమే కాకుండా, సొంత అవసరాలకు పోను మిగిలిన కరెంట్‌ను గ్రిడ్‌ కు అమ్మి.. గ్రామీణులు వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారులుగా మారి ఆదాయాన్ని గడిస్తున్నారు.

ముఖ్యంగా బోనకల్‌ మండలానికి మొదటిదశలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడే గృహాలకు, వ్యవసాయ మోటార్లకు సోలార్‌ ప్యానళ్లు అమర్చుతున్నారు. మండలంలోని 22 గ్రామాల్లో సర్వే చేసి సోలార్‌ ఏర్పాటుకు అనువుగా ఉన్న 7,075 స్లాబ్‌ ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంటికి రూ.1.36 లక్షల విలువైన రెండు కిలోవాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 40 శాతం ఇళ్లల్లో ప్యానెల్‌ అమరిక పూర్తయింది. వినియోగదారులు తమ వాడకానికి పోను, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపితే.. ప్రభు త్వం యూనిట్‌కు రూ. 2.75 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం కుసుమ్‌ కాంపోనెంట్‌’ పథకంతో పాటు రాష్ట్ర ప్రభు త్వం అదనంగా సబ్సిడీని అందిస్తుంది. వ్యవసాయ పంపుసెట్లకు రూ.5 లక్షల సబ్సిడీతో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్‌ కనెక్షన్లు అందిస్తున్నారు. బోనకల్‌ మండలంలో 2,838 పంపుసెట్లు ఉండగా, ఇప్పటి వరకు 6 పంపుసెట్లకు సోలార్‌ అమర్చారు.

11.jpg


5హెచ్‌పీ మోటార్ల కోసం 500 చదరపుగజాల స్థలంలో ప్యానెళ్లు ఏర్పాటుచేసి రోజుకు 30 యూనిట్ల చొప్పున ఏడాదికి 12,438 యూనిట్లు ఉత్పత్తి జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో సాగుకు 4,699 యూనిట్లు వాడగా, మిగిలిన 7,884 యూనిట్లు గ్రిడ్‌ కు అమ్మడం ద్వారా ఏడాదికి రూ.20 వేల ఆదాయం అదనంగా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మధిరలోని ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్‌ మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రారంభించారు. నాలుగెకరాల భూమిలో నిర్మించిన ఈ ప్లాంట్‌ను.. 33 కేవీ లైన్‌ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసి సోలార్‌ విద్యుత్‌ను తీసుకున్నారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది రూ.40 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు ఆదాయం సమకూరనుంది దశల వారీగా ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

రెండు నెలల్లో వంద శాతం పూర్తి

‘‘బోనకల్‌ను మోడల్‌ సోలార్‌ మండలంగా మార్చే ప్రక్రియ వేగంగా సాగుతోంది. 22గ్రామాల్లో ఇప్పటికే 3200 ఇళ్లపై ప్యానళ్లు అమర్చి సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. రెండు నెలల్లో మిగిలిన ఇళ్లకు కూడా అందిస్తాం. ఒక్కో ఇంటిపై ప్లాంట్‌ ఏర్పాటు కోసం రూ. 1.36 లక్షలు, వ్యవసాయ సోలార్‌ ప్లాంట్‌ కోసం రూ. 5లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.’’

10.jpg

- పి.అజయ్‌కుమార్‌, తెలంగాణ రెడ్కో ఖమ్మం జిల్లా మేనేజర్‌

Updated Date - Jun 15 , 2026 | 04:15 AM