అమెరికాలో వరంగల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:44 AM
ఆమెరికాలో స్థిరపడిన వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో అకాల మరణం చెందారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ సమీపంలో ఉన్న రామనాథపురి ....
పోచమ్మమైదాన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆమెరికాలో స్థిరపడిన వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో అకాల మరణం చెందారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ సమీపంలో ఉన్న రామనాథపురి కాలనీకి చెందిన తాటిపత్రి జితేందర్‌రావు, సరస్వతి దంపతుల కుమారుడు రాకేశ్ (40) సుమారు 15 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం వర్జీనియాలోని తన నివాసంలో రాకేశ్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడంతో రామనాథపురిలోని ఆయన స్వగృహంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాకేశ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చే యత్నాలు జరుగుతున్నాయని, మూడు రోజుల్లో మృతదేహం వరంగల్ చేరుకోవచ్చని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, రాకేశ్‌కు 2014లో కరీంనగర్ కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇషాన్, ఇవాన్ అనే కవల పిల్లలు ఉన్నారు.