స్మార్ట్ మీటర్లపై ఒప్పందాలు బీఆర్‌ఎస్ హయాంలోనే..
ABN , Publish Date - May 25 , 2026 | 05:08 AM
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో.. అసలు ఈ పథకానికి సంబంధించి బీఆర్‌ఎస్ పాలనలోనే కేంద్రంతో ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వ....
‘సాగు’కు స్మార్ట్ మీటర్లు ఉండవు
స్మార్ట్ మీటర్లకయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
2017లో కేంద్రంతో ఎంవోయూ
2024లోనే అసెంబ్లీలో చెప్పిన సీఎం ప్రభుత్వ వర్గాల వెల్లడి
హైదరాబాద్, మే 24, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో.. అసలు ఈ పథకానికి సంబంధించి బీఆర్‌ఎస్ పాలనలోనే కేంద్రంతో ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2017 జనవరి 4న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని గుర్తుచేశాయి. అలాగే.. 2021లో కేంద్రం ఆర్‌డీఎ్‌సఎస్ పథకాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చిందని, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని పేర్కొన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టబోమని.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని స్మార్ట్ మీటర్లతో గందరగోళం చేయొద్దని, అది సర్కారు హామీ అని, ఎవరికైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఆ సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును ప్రజల నుంచి వసూలు చేస్తారనే ప్రచారం అసత్యమని, దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని,ప్రజలపై ఏ మాత్రం భారం పడదని పేర్కొన్నాయి. దీనికి సంబంధించి 2024లోనే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్మార్ట్‌మీటర్ల ఒప్పందం వివరాలను ఆయన బహిర్గతం చేశారని, అయినా పదేపదే అవే ఆరోపణలు చేస్తూ కొందరు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ ఆరోపణలు సత్యదూరమని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. కేంద్ర సర్కారు విద్యుత్ సంస్కరణల్లో భాగంగానే‘‘ఉదయ్’ (ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన) పథకం, అనంతరం ఆర్‌డీఎ్‌సఎస్ (రీవ్యాం్‌పడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) అమల్లోకి వచ్చాయని తెలిపారు. డిస్కంల అప్పుల భారం తగ్గించడం, విద్యుత్ కొనుగోలు ఖర్చు-ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, సాంకేతిక, వాణిజ్య నష్టాలను నియంత్రించడం ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
నాటి ఒప్పందంలో..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తరఫున జి. రఘుమారెడ్డి సం తకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ ఒప్పందాల్లోనే ఫీడర్, మీటరింగ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌ఫార్మర్ మీటరింగ్, అధిక వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి లక్ష్యాలు పొందుపరిచినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్తును వాడేవారికి 2018 డిసెంబర్ నాటికి, 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి 2019 డిసెంబర్ నాటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని అప్పుడే నిర్ణయించారని పేర్కొన్నాయి. ఇప్పుడీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పాలన లో అంగీకరించిన నిబంధనలను ఇప్పుడు కొత్తగా తెచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఆర్‌డీఎ్‌సఎస్ కింద కేం ద్రం నుంచి 60శాతం వరకు గ్రాంట్ రూపం లో నిధులు లభిస్తాయని, ఆ నిధులతో పాత లైన్లు, బలహీన నెట్ వర్క్, అధిక నష్టాలు ఉండే ప్రాంతాల్లోని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపా యి. డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగైతేనే ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. దీనివల్ల రైతుల ఉచిత విద్యుత్‌పై ప్రభావం ఉండదని.. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయరని.. ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, అధి క వినియోగం ఉన్న గృహాలు, పరిశ్రమల్లోనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేపడతారని తెలిపా యి. విద్యుత్ వినియోగంపై పారదర్శక బిల్లింగ్ నష్టాల నియంత్రణ కోసమే ఈ చర్యలు తప్ప.. వినియోగదారులపై భారం మోపడం లక్ష్యం కాదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.