Share News

స్మార్ట్‌ డిస్కమ్‌ సిద్ధం!

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:05 AM

ప్రతి యూనిట్‌ను పక్కాగా లెక్కించేలా అత్యాధునిక సాంకేతికతతో కొత్తగా స్మార్ట్‌ డిస్కమ్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు ఆస్తులు, ఉద్యోగులు, అప్పులు, కరెంట్‌ కొనుగోళ్ల బకాయిల బదిలీపై స్పష్టత వచ్చింది.

స్మార్ట్‌ డిస్కమ్‌ సిద్ధం!

  • వారం రోజుల్లో టీజీఈఆర్‌సీకి దరఖాస్తు

  • తెలంగాణ కిసాన్‌ డిస్కమ్‌గా పేరు..?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి యూనిట్‌ను పక్కాగా లెక్కించేలా అత్యాధునిక సాంకేతికతతో కొత్తగా స్మార్ట్‌ డిస్కమ్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు ఆస్తులు, ఉద్యోగులు, అప్పులు, కరెంట్‌ కొనుగోళ్ల బకాయిల బదిలీపై స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో కొత్త డిస్కమ్‌ లైసెన్స్‌ కోసం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకోనున్నారు. ఈ డిస్కమ్‌ పూర్తిస్థాయిలో నిలదొక్కుకొని, కార్యకలాపాలు సాగించేదాకా దక్షిణ లేదా ఉత్తర డిస్కమ్‌ సీఎండీని ప్రభుత్వం నోడల్‌ అధికారిగా నియమించనుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్త డిస్కమ్‌ను మనుగడలోకి తేవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. టీజీఈఆర్‌సీలో దరఖాస్తు చేసుకునే క్రమంలో దీనికి ‘తెలంగాణ కిసాన్‌ డిస్కమ్‌’గా నామకరణం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోగానే దీనిపై సూచనలు/సలహాలు/అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం లైసెన్స్‌ జారీపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత దీని ఏర్పాటుపై నోటిఫికేషన్‌ వెలువరించి, కొత్త డిస్కమ్‌ ఫలానా తేదీ నుంచి మనుగడలోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కనెక్షన్లు, పీపీఏలు, బకాయిలు, ఉద్యోగులు ఆ డిస్కమ్‌కు బదిలీ కానున్నారు. కొత్తగా సీఎండీతో పాటు డైరెక్టర్ల నియామకం కూడా ప్రభుత్వం చేపట్టనుంది. 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డు, 1132 మిషన్‌ భగీరథల కనెక్షన్లు కొత్త డిస్కమ్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరంతో దక్షిణ డిస్కమ్‌(టీజీఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌), ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌)లు చితికిపోతున్నాయని, వాటి పరపతి పెంచడానికి వీలుగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.


పాత డిస్కమ్‌ల నెట్‌వర్క్‌తోనే కొత్త డిస్కమ్‌ పనిచేయనుంది. రెండు డిస్కమ్‌ల పరిధిలో 5,22,479ల వ్యవసాయ డీటీఆర్‌(పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌)లు ఉండగా... 2,61,240 కి.మీ. మేర వ్యవసాయ ఎల్‌టీ (లోటెన్షన్‌) లైన్లు ఉన్నాయి. డీటీఆర్‌ల ఖరీదు రూ.2792 కోట్లు కాగా ఎల్‌టీ లైన్ల విలువ రూ.21,37కోట్లుగా ఉంటుందని లెక్క వేశారు. దాంతో రూ.4,929 కోట్ల ఆస్తులు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. కొత్త డిస్కమ్‌ పరిధిలోకి వచ్చే ప్రతి డీటీఆర్‌ (డిస్ట్రిబ్యూసన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌)కు స్మార్ట్‌మీటర్‌ బిగించనున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.25 వేలు అవుతాయని అంచనా. ఈ మేరకు 5,22,479ల వ్యవసాయ డీటీఆర్‌లకు రూ.1306 కోట్లు అవుతాయని లెక్కతీశారు.


పీపీఏల బదిలీ ఇలా..

ఐదేళ్ల కాలానికి గాను వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, వాటర్‌బోర్డు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ/మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఏ మేరకు విద్యుత్‌ను వినియోగించాయో ఆ నిష్పత్తి ఆధారంగా కొత్త డిస్కమ్‌కు పీపీఏ(విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను బదలాయించనున్నారు. ఐదేళ్లకాలంలో ఆయా కనెక్షన్ల వినియోగం 1,56,775 మిలియన్‌ యూనిట్లుగా రికార్డయింది. మొత్తం విద్యుత్తు వినియోగంలో 42 శాతం వాటాను కొత్త డిస్కమ్‌ కలిగి ఉండనుంది.

2వేల మంది సిబ్బంది

కొత్తగా ఏర్పాటు చేయదలిచిన డిస్కమ్‌కు పాలకమండలితో పాటు సీఎండీని, ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు (సీఈ), ప్రతి పాత జిల్లాకు ఒక ఎస్‌ఈ చొప్పున 10 మందిని, 38 సర్కిళ్లకు ఒక్కో డీఈని, 90 మంది ఏడీఈలను, 520 మంది సబ్‌ ఇంజనీర్లు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ ఎం) ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు కలిపి 1000 మంది, పాలన సిబ్బంది 340 మంది కలుపుకొని 2 వేల మందితో కొత్త డిస్కమ్‌ కొలువు దీరనుంది. వీరిని పాత డిస్కమ్‌ల నుంచే కొత్తగా ఏర్పడే సర్దుబాటు చేయనున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 07:06 AM