Share News

స్లీపర్‌ బస్సు దగ్ధం.. 36మందికి తప్పిన ముప్పు

ABN , Publish Date - May 31 , 2026 | 05:51 AM

అర్ధరాత్రి రోడ్డు మీద వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

స్లీపర్‌ బస్సు దగ్ధం.. 36మందికి తప్పిన ముప్పు

  • ఇంజిన్‌ వేడెక్కడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంటలు

  • నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఘటన

చిట్యాలరూరల్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి రోడ్డు మీద వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారుజామున 2గంటలకు ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌ మియాపూర్‌ నుంచి రెయిన్‌బో సంస్థకు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 36 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 9గంటలకు ఏపీలోని కాకినాడకు బయలుదేరింది. చిట్యాల మండలం వెలిమినేడు దాటి, పెద్దకాపర్తి శివారులోకి బస్సు చేరుకోగానే ఇంజిన్‌ నుంచి మంటలు వస్తున్నట్లు డ్రైవర్‌ గమనించాడు. రోడ్డు పక్కన బస్సును నిలిపి.. కిందకు దిగాలని ప్రయాణికులను ఉద్దేశించి గట్టిగా కేకలు వేశాడు. వెంటనే.. బస్సు ప్రధాన ద్వారం నుంచి కొందరు, అత్యవసర ద్వారం నుంచి మరికొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగిపోయారు. తర్వాత బస్సు మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయింది. చాలామంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బస్సులో ఉండిపోవడంతో దగ్ఘమైంది.

Updated Date - May 31 , 2026 | 05:51 AM