Share News

పైకప్పు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు!

ABN , Publish Date - May 28 , 2026 | 03:52 AM

శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు అడుగడుగునా ఆటంకాలతో నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది బ్రహ్మగిరి వద్ద జరిగిన ఘోర ప్రమాదం తర్వాత...

పైకప్పు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు!

  • ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో భయంకరమైన శబ్దాలు

  • పనులు చేసేందుకు జంకుతున్న కార్మికులు

  • నత్తనడకన సాగుతున్న పనులు

  • మూడు నెలల్లో జరిగింది 230 మీటర్ల తవ్వకమే

బ్రహ్మగిరి, మే 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు అడుగడుగునా ఆటంకాలతో నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది బ్రహ్మగిరి వద్ద జరిగిన ఘోర ప్రమాదం తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఇరు వైపులా కలిపి రోజుకు కనీసం 7 మీటర్ల మేర తవ్వకం జరగాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం రోజుకు 3 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ చేసిన తర్వాత అక్కడ పేరుకుపోయిన శిథిలాలను బయటకు తరలించడానికే దాదాపు ఒక రోజంతా పడుతోందని కార్మికులు చెబుతున్నారు. గతేడాది సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత ఈఏడాది ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకు ఔట్‌లెట్‌ (మన్నెవారిపల్లి) వైపు 165 మీటర్లు, ఇన్‌లెట్‌ (బ్రహ్మగిరి) వైపు 65 మీటర్లు కలిపి మొత్తం 230 మీటర్ల తవ్వకం మాత్రమే పూర్తయినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. మరోవైపు, సొరంగం లోపల పనులు చేయడానికి కార్మికులు జంకుతున్నారు. బ్లాస్టింగ్‌ చేసిన తర్వాత సొరంగం పైకప్పు నుంచి భయంకరమైన శబ్దాలతో పాటు రాతి పెచ్చులు ఊడిపడుతుండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. సొరంగం తవ్విన వెంటనే పైకప్పు గట్టిపడడానికి సిమెంట్‌ కెమికల్‌ గ్రౌటింగ్‌ చేస్తారు. అయితే ఆ సిమెంటు కొండకు బిగుసుకోకముందే వెనువెంటనే తదుపరి డ్రిల్లింగ్‌ చేస్తుండడంతో భారీ రాతి ముక్కలు యంత్రాలపై పడుతున్నాయి. గతంలో ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్న ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటున్న కార్మికులు.. ఈ వింత శబ్దాలు మరేదైనా పెద్ద ప్రమాదానికి సంకేతాలా అని భయపడుతున్నారు. ఈ విషయంపై ఎస్‌సెల్‌బీసీ ఎగ్జికూటివ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణను వివరణ కోరగా, సొరంగం పనుల్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనని, పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

Updated Date - May 28 , 2026 | 03:52 AM