2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం సిద్ధం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:43 AM
అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 2028 జూన్ నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్(ఎస్ఎల్‌బీసీ) పనులను పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
4 లక్షల ఎకరాలకు నీరందిస్తాం: ఉత్తమ్
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 2028 జూన్ నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్(ఎస్ఎల్‌బీసీ) పనులను పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకున్న అడ్డంకులను తొలగించి, భూసేకరణ సమస్యలను కూడా పరిష్కరించి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, కెనాల్ వ్యవస్థను ఏకకాలంలో పూర్తిచేస్తామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పునః ప్రారంభించినప్పటి నుంచి అర కిలోమీటర్ మేర పురోగతి సాధించామన్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి, 4 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు.