Share News

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకానికి లైన్‌ క్లియర్‌!

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:31 AM

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌ పనులను అడ్వాన్స్‌డ్‌ టన్నెలింగ్‌ మెథడ్‌(డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం)లో 2028 జూన్‌ 30కల్లా పూర్తి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో కీలక అడుగు పడింది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకానికి లైన్‌ క్లియర్‌!

  • డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తొలి అడుగు.. ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌ పనులను అడ్వాన్స్‌డ్‌ టన్నెలింగ్‌ మెథడ్‌(డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం)లో 2028 జూన్‌ 30కల్లా పూర్తి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో కీలక అడుగు పడింది. ఔట్‌లెట్‌(మన్నెవారిపల్లి, అచ్చంపేట) వైపు నుంచి డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అమలు చేశారు. ఇందులో 3.50 మీటర్ల మేర టన్నెల్‌ను తవ్వారు. ఈ ప్రక్రియలో మరింత ముందుకు వెళ్లనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పొడవు 43.931 కిలోమీటర్లు. శ్రీశైలం వైపు నుంచి 13.93 కిలోమీటర్లు తవ్వగా.. మన్నెవారిపల్లి నుంచి 20.43 కిలోమీటర్లు తవ్వారు. మరో 9.559 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. ఇదంతా పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరందనుంది. అయితే ఇన్‌లెట్‌లో చాలా సమస్యలు ఉండటంతో తొలుత ఔట్‌లెట్‌ వైపు 9 కిలోమీటర్లకు పైగా టన్నెల్‌ను తవ్విన తర్వాతే ఇన్‌లెట్‌ వైపు అడుగులు వేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇన్‌లెట్‌ వైపు సీపేజీ భారీగా ఉంటుంది. ఇప్పటికే పంపులతో నీటిని తీసేస్తున్నారు. టీబీఎంలతో ఇక టన్నెల్‌ తవ్వడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాలే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో టన్నెల్‌ పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. టన్నెల్‌ తవ్వకం మూడు షిఫ్టుల్లో చేపట్టనున్నారు. అంతేకాకుండా ఎస్‌ఎల్‌బీసీ పేరుతో ప్రత్యేక సర్కిల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నిపుణులనే నియమించుకోనున్నారు. ఇప్పటికే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పునః ప్రారంభానికి వీలుగా నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ) సహకారంతో ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ సర్వే కూడా పూర్తి చేశారు. భూగర్భంలో ఎక్కడెక్కడ ఏయే ఇబ్బందులు రానున్నాయనే దానిపై స్పష్టత కూడా వచ్చింది. ఏ విధంగానైనా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. టన్నెల్‌ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్య జాబితాలో పెట్టింది.

Updated Date - Feb 19 , 2026 | 04:31 AM