SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీలో టీబీఎం తొలగింపు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:51 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వడానికి వినియోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)ను పూర్తిగా తొలగించారు...
2 కంపెనీలకు చెందిన 20 మంది నెలరోజులపాటు శ్రమించి ఆ యంత్రాన్ని ముక్కలుగా కత్తిరించిన వైనం
మిగిలిన 9.53 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకాన్ని డీబీఎం పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించిన సర్కారు
బ్రహ్మగిరి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వడానికి వినియోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)ను పూర్తిగా తొలగించారు! రాబిన్ కంపెనీ, జేపీ కంపెనీ అధ్వర్యంలో సుమారు 20 మంది నెల రోజులకుపైగా శ్రమించి.. దాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి తీసేశారు. మిగిలిన పనులను రెండువైపులా ‘డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (డీబీఎం)’లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సొరంగం పొడుగు 43.93 కిలోమీటర్లు కాగా.. నాగర్‌కర్నూలు జిల్లా బ్రహ్మగిరి వద్ద ఇన్‌లెట్ టన్నెల్ వైపు 13.93 కిలోమీటర్ల వరకూ తవ్వకం జరిగాక, గత ఏడాది ఫిబ్రవరిలో భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి పైకప్పు టీబీఎంపై కూలింది. ఆ సమయంలో అక్కడున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు! ప్రమాదం కారణంగా ఇన్‌లెట్ టన్నెల్‌వైపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అవుట్‌లెట్ టన్నెల్‌లో కూడా టీబీఎం బేరింగ్ పాడవడంతో అటువైపు పనులూ నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎంకు బిగించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి అమెరికా నుంచి బేరింగ్ తెప్పించింది. కానీ, దాన్ని బిగించకుండానే పక్కన పెట్టారు. ప్రమాద ఘటన తరువాత మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం 12 మందితో సాంకేతిక కమిటీని నియమించింది. ఇన్‌లెట్ టన్నెల్ వైపు 13.950 కిలోమీటర్ల నుంచి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని నివేదిక అందడంతో ఇరువైపులా డీబీఎం పద్ధతిలో సొరంగం పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌లెట్ టన్నెల్ వైపు 13.93 కి.మీ వరకూ తవ్వకం జరగ్గా.. మన్యవారిపల్లి దగ్గర ఆవుట్‌లెట్ టన్నెల్ వైపు 20.43 కి.మీ మేర సొరంగం తవ్వారు. ఇంకా 9.53 కి.మీ మేర సొరంగం తవ్వాల్సి ఉంది. ఆ పనులనే డీబీఎం పద్ధతిలో చేపట్టనున్నారు. కాగా బ్రహ్మగిరి వద్ద ఇన్‌లెట్ టన్నెల్ ప్రమాదంలో శిథిలాల్లో కూలీలు చిక్కుకున్న ప్రాంతం పూర్తిగా ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ 50 మీటర్ల మేర సొరంగం పూర్తిగా మూసివేసేందుకు కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి.