భవిష్యత్తులో రీ యూజబుల్ రాకెట్లు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:29 AM
ఎనిమిదేళ్ల కష్టం.. ఎంతో శ్రమ.. ఎన్నో తిరస్కరణల తరువాత కలలు సాకారమవుతున్న వేళ.. మూడు రోజులపాటు వారికి నిద్రలేదు. రాత్రి పగలు తేడా లేదు. ఒకటే ఆలోచన..
ఇస్రోకు పీఎస్ఎల్‌వీలా స్కైరూట్‌కు విక్రమ్‌ను మార్చడమే లక్ష్యం
మేం కంపెనీ ప్రారంభించే నాటికి భారత్‌లో స్పేస్ విధానమే లేదు
మొదట్లో నిధుల సమీకరణ మాకు అతి పెద్ద సమస్యగా మారింది
అప్పటికి సాఫ్ట్‌వేర్, ఈ-కామర్స్‌ల వైపే పెట్టుబడిదారుల చూపు ఉండేది
రాకెట్ తయారుచేస్తామంటే నమ్మేవాళ్లు తక్కువ
మింత్రా, గ్రీన్‌కో విజనరీగా ఆలోచించాయి
ఇస్రో తమ సొంత మిషన్‌లా సహకరించింది
ప్రయోగం ఖర్చు తగ్గితే మార్కెట్ పెరుగుతుంది
‘ఆంధ్రజ్యోతి’తో స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగభరత్ డాకా
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల కష్టం.. ఎంతో శ్రమ.. ఎన్నో తిరస్కరణల తరువాత కలలు సాకారమవుతున్న వేళ.. మూడు రోజులపాటు వారికి నిద్రలేదు. రాత్రి పగలు తేడా లేదు. ఒకటే ఆలోచన.. మిషన్ సక్సెస్. పూర్తిస్థాయిలో తొలి ప్రయోగంపై ఉత్కంఠ. స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు నాగభరత్ డాకా, పవన్‌కుమార్‌ల పరిస్థితి ఇది. ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందు కౌంట్‌డౌన్ చెప్పే టైమర్ ఆగిపోవడంతో ఆందోళన. కానీ, అంతరాయాన్ని సరిచేసుకుని విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాళ్లిద్దరి కల నెరవేరింది. వారే కాదు.. ఈ తొలి ప్రైవేటు రాకెట్ తనతో నింగిలోకి మోసుకెళ్లిన ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడుతుందా? అని దేశమంతా ఎదురుచూసింది. ప్రైవేట్ రాకెట్‌ల విజయవంతమైన ప్రయోగాలకు భారత్‌లోనూ ముందడుగు పడింది. భవిష్యత్తులో రీయూజబుల్ రాకెట్లు తయారు చేయాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమంటున్న స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగభరత్ డాకా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
ఇస్రోలో ఉద్యోగం.. స్కైరూట్ సంస్థ ప్రారంభం. పవన్‌కుమార్‌తో మీ పరిచయం, ప్రస్థానం ఎలా?
ఇద్దరం తెలుగువారమే. కానీ తొలుత పరిచయస్తులం కాదు. పవన్‌కుమార్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో, నేను ఐఐటీ మద్రాసులో చదువుకున్నాం. ఐఐటీల్లోనే ఇద్దరికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఇస్రోలో చేరాం. త్రివేంద్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం. అప్పట్లో ఇస్రో రూపొందిస్తున్న ఎల్‌వీఎం-3 రాకెట్ లాంచర్ తుదిదశ అభివృద్ధిలో ఉండేది. ఆ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. నా సబ్జెక్టు ఎలక్ర్టానిక్స్ కావడంతో.. రాకెట్ తయారీలో ఎలక్ర్టానిక్స్‌లో పనిచేసేవాడిని. పవన్‌కుమార్ రాకెట్ తయారీలోని మెకానికల్ విభాగంలో చేసేవాడు. అలా మా నైపుణ్యాలు సరిపోయాయి. కొంతకాలానికి నాకు వివాహమైంది. హైదరాబాద్‌లోనే ఒక స్టార్ట్‌పను ఈ రంగంలో ప్రారంభిస్తే బాగుండుననుకున్నా. పవన్‌ది కూడా అదే ఆలోచన. దాంతో స్కైరూట్ ఏర్పాటైంది.
మీ రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లే క్రమంలో ఎదుర్కొన్న అతిపెద్ద సమస్యలేంటి?
మేం కంపెనీ ప్రారంభించే నాటికి భారత్‌లో స్పేస్ పాలసీ కూడా లేదు. కావాలంటే ఉపగ్రహం తయారు చేయవచ్చు.. రాకెట్ తయారు చేయవచ్చు. కానీ, లాంచ్ చేయడానికి మాత్రం ప్రభుత్వ విధానం లేదు. మేం దీనిని కూడా ఒక అవకాశంగా భావించాం. ప్రపంచంలో ఏదైనా ముందుగా టెక్నాలజీ వస్తుంది. తర్వాత దానికి సంబంధించిన చట్టం, విధానం వస్తాయి. ఏ సంస్థలూ ఆ పనిచేయకపోతే విధానం తేవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు కదా! ఎప్పటికో అప్పటికి చేయాల్సిందే అని మేం ప్రారంభించాం. మాకు అసలు సమస్య నిధుల సమీకరణ. చాలా సందర్బాల్లో ఇది నిరాశపరిచింది. ఇతర స్టార్ట్‌పలకు, రాకెట్ తయారీ స్టార్ట్‌పకు తేడా ఉంది. ఇతర స్టార్ట్‌పలలో ఒక వస్తువు, సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి తర్వాత మార్కెటింగ్‌కి వెళ్లొచ్చు. కానీ, రాకెట్ స్టార్టప్ అలా కాదు. ముందు దానిని తయారు చేయడానికే నిధులు కావాలి. మాకేం డబ్బుల్లేవు. మా కుటుంబాలకు అంత డబ్బు పెట్టే స్థోమతా లేదు. డబ్బు లేకపోతే కాగితాలపైనే ప్రణాళికలు ఉండిపోతాయి. అయితే అదృష్టవశాత్తూ మింత్రా, క్యూర్‌ఫిట్‌ల ఫౌండర్ ముఖేష్ బన్సాల్, గ్రీన్‌కో వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ చలమలశెట్టి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. వాస్తవానికి అప్పట్లో రాకెట్ తయారుచేస్తామని చెబితే నమ్మేవాళ్లు తక్కువ. కొందరి దగ్గరికి వెళ్లినా దీనికి డబ్బు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఈ-కామర్స్, సాఫ్ట్‌వేర్ రంగాలైతే పెడతామని వెంచర్ క్యాపిటలిస్టులు చెప్పేవారు. అలాంటి సమయంలో ఆ రెండు కంపెనీలు విజనరీలుగా ఆలోచించి మా కంపెనీకి అవసరమైన రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టారు.
స్పేస్‌కు, రాకెట్ తయారీలకు సంబంధించి ప్రభుత్వ విధానంలో మార్పులొచ్చాయా?
ప్రభుత్వం చాలా సంస్కరణలు తెచ్చింది. రెడ్‌టేప్ టు రెడ్ కార్పెట్ వరకు సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రోత్సాహకరమైన విధానం తెచ్చింది. ఇస్రో చాలా ఖర్చుపెట్టి లాంచింగ్ సౌకర్యాలు కల్పించింది. అయితే ఆ లాంచింగ్ సౌకర్యాలను ప్రైవేటు కంపెనీలు కూడా ఉపయోగించుకునేలా చేశారు. కొంతమొత్తం చెల్లించి ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. అది చాలా కీలక సంస్కరణ. మేం తయారీ ఖర్చు పెట్టుకుంటే చాలు. ఇస్రోలో టాప్ క్లాస్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దీనివల్ల స్పేస్ ఇండస్ర్టీకి మంచి సంకేతాలు వెళ్లాయి. ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు రాకెట్‌ల తయారీ దశలో ఉన్నాయి.
స్పేస్ ఎక్స్ లాంటి అమెరికా దిగ్గజ కంపెనీతో పోలిస్తే మనకున్న అనుకూలత, ప్రతికూలతలేంటి?
చైనాను మినహాయిస్తే రాకెట్ ఇండస్ర్టీలో ప్రపంచం మొత్తమ్మీద ఆపరేషనల్ రాకెట్‌లను తయారు చేస్తున్నవి ఇప్పటికి రెండే కంపెనీలు. అందులో ఒకటి ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కాగా, ఇంకో సంస్థ కూడా ఉంది. అంటే రోదసిలో ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహాలు, చిన్న ఉపగ్రహాల తయారీ పెరుగుతోంది. కమ్యూనికేషన్, ఇతర అవసరాలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ, వాటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే రాకెట్‌లు లేవు. మనకు ఇదో ఉపయోగించుకోదగిన అవకాశం. మరోవైపు స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలతో పోలిస్తే భారత్‌లో రాకెట్‌ల తయారీ ఖర్చు తక్కువ. ఇస్రో కూడా మంగళ్‌యాన్, చంద్రయాన్ ప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతోనే ప్రణాళికలు వేసుకుంది. ఆ తక్కువ ఖర్చు అన్నది భారత్‌కున్న అవకాశం. అది ప్రైవేటు రంగానికీ వర్తిస్తుంది.
తక్కువ ఖర్చుతో లాంచ్ వెహికల్ వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి?
ప్రయోగం ఖర్చు తగ్గితే శాటిలైట్ ఖర్చు తగ్గుతుంది. ఎంత తక్కువ ఖర్చుతో శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపగలిగితే.. దానివల్ల వచ్చే ప్రయోజనాల ఖర్చూ అంతమేర తగ్గుతుంది. మొత్తం స్పేస్ మార్కెట్ పెరగాలంటే కొంతమంది భరించేలా మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులోకి రావాలి. అప్పుడు ఆ ప్రయోజనం దేశాలు, కంపెనీల నుంచి ఆ శాటిలైట్‌ల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకూ తక్కువ ఖర్చుతోనే అందించవచ్చు.
కార్బన్ ఫైబర్, త్రీడీ ప్రింటింగ్ ప్రయోజనాలేంటి?
మా రాకెట్ తయారీ కోసం వినూత్నంగా ముందుకెళ్లాం. కార్బన్ ఫైబర్ కాంపొనెంట్‌లు వాడాం. ఇంజన్‌లన్నీ త్రీడీ ప్రింటింగ్‌తో తయారుచేశాం. ఎందుకంటే రాకెట్ తేలిగ్గా ఉండాలి. రాకెట్‌లో 90 శాతం ఇంధనమే ఉంటుంది. అది మండుతుంటే రాకెట్ పైకి వెళ్తుంది. రాకెట్ తేలిగ్గా ఉంటే వేగంగా అంతరిక్షాన్ని చేరుతుంది. అదీ తక్కువ ఇంధనం వాడుకుని. ఇక త్రీడీ ప్రింటింగ్ ఏంటంటే.. సాధారణంగా ఒక లోహాన్ని మిల్లింగ్ చేసి మిషనింగ్ చేయాలి. అంటే యంత్రాల సాయంతో మనకు కావాల్సిన ఆకారంలో తయారు చేసుకోవాలి. అలా కాకుండా లోహం పొడి నుంచి లేజర్ సాయంతో మనకు కావాల్సిన ఆకారంలో పరికరాలను తయారు చేసుకోవచ్చు. దానివల్ల ఏదైనా ఒక ఇంజన్‌లో తేడా ఉన్నా మళ్లీ త్రీడీ ప్రింటింగ్ పద్ధతిలో త్వరగా తయారుచేయవచ్చు. భారత్‌లో ఈ టెక్నాలజీ మొదటిసారి.
మిషన్ విక్రమ్‌కు ఇస్రో నుంచి ఎలాంటి మద్దతు లభించింది?
ఇస్రో మద్దతు లేకుండా ఈ మైలురాయిని సాధించేవాళ్లం కాదు. వాళ్ల సొంత మిషన్‌లానే సహకరించారు. ఎన్నో వారాలపాటు శ్రీహరికోటకు వెళ్లి వాళ్ల లాంచ్‌పాడ్, సేఫ్టీ మెకానిజం వాడుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహక విధానం వల్లే ఇది చేసుకోగలిగాం.
స్పేస్ ఎక్స్‌లా భవిష్యత్తులో రీయూజబుల్ రాకెట్‌ను తయారుచేసే లక్ష్యం ఉందా?
స్పేస్ ఎక్స్ ఒక పాక్షిక రీయూజబుల్ రాకెట్‌ను తయారుచేసింది. రాకెట్ కింద ఉండే బూస్టర్ పదే పదే రోదసిలోకి వెళ్లి మళ్లీ తిరిగొస్తూ ఉంటుంది. అలాంటిది తయారుచేయాలన్నది మా దీర్ఘకాలిక లక్ష్యం. అయితే మాకో తక్షణ లక్ష్యం ఉంది. విక్రమ్ సిరీస్ రాకెట్‌ను ఎప్పుడు ప్రయోగించినా విజయవంతం అయ్యేటట్లు చేయడం. ఒక విజయవంతమైన రాకెట్ తయారీ ఎంత కష్టమో...అంతకంటే కష్టమైంది మళ్లీ మళ్లీ అదే రాకెట్‌ను తయారుచేసి విజయవంతం చేయడం. ఇస్రోకు పీఎ్‌సఎల్‌వీ లాంచ్ వెహికల్ అంటే నమ్మకం. అతి తక్కువ వైఫల్యాలు.. అత్యధిక విజయాలను అది సొంతం చేసుకుంది. మా విక్రమ్ సిరీ్‌సను కూడా అలాగే చేయాలన్నది ప్రస్తుత లక్ష్యం.
ప్రస్తుతం మీ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారు?
కొత్తలో తక్కువ మంది ఉండేవారు. కానీ, ఇప్పుడు ఇప్పుడు వెయ్యి మందికి పైగా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్‌లోని మా కంపెనీలో పనిచేస్తున్నారు. వాస్తవానికి లాంచ్ వెహికల్ అంటే అనేక ఫీల్డ్‌లుంటాయి. రాకెట్ తయారుచేస్తే అది ఎలా వెళ్తుందన్నది అంచనా వేయడానికి ఒక సిమ్యులేషన్ వ్యవస్థ ఉండాలి. ప్రొపల్షన్ అభివృద్ధి.. రాకెట్ తయారీలో కీలకం. ఇలాంటి విభాగాలన్నింటిలోనూ ఇప్పుడు నిష్ణాతులైన టీం మా దగ్గరుంది.
ఏలూరు.. అల్లుడే
నాగభరత్ డాకాకు ఏలూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఏలూరుకు చెందిన చావలి శ్రీరామచంద్రమూర్తి, బాలత్రిపుర సుందరి దంపతుల కుమార్తె పావనిని... ఒంగోలు సమీపంలోని బి.నిడమనూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రఘురామిరెడ్డి, శాంతలక్ష్మి దంపతుల కుమారుడు నాగభరత్ 2016లో వివాహమాడారు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన పావని... ప్రస్తుతం హైదరాబాద్ డెలాయిట్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నాగభరత్, పావని దంపతులకు రామతేజస్ (6), సుహాస్ (రెండున్నరేళ్లు) కుమారులు. ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన నాగభరత్‌తోపాటు ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన పవన్‌కుమార్ చందన (రాజమహేంద్రవరం) ‘ఇస్రో’లో శాస్త్రవేత్తలుగా పనిచేశారు. 2018లో స్టార్ట్‌పగా స్కైరూట్ ఏరోస్పే్‌సను ప్రారంభించారు.
ఏపీలో భూమి కేటాయింపు
ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరువలో కార్యకలాపాలు సాగిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ భవిష్యత్తును సీఎం చంద్రబాబు ముందే ఊహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీహరికోటకు సమీపాన తిరుపతి జిల్లాలోని రౌతుసురమాల, బీ.ఎ్‌స.పురం, కొత్తపాలెం గ్రామాల పరిధిలో గతేడాది సెప్టెంబరు 6న 300 ఎకరాల భూములు కేటాయించారు. రూ.400 కోట్లు పెట్టుబడితో, 300 మందికి ఉపాధి కల్పించడానికి వీలుగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను ఇక్కడ స్థాపించేందుకు అనుమతులిచ్చింది. త్వరలోనే భూములను స్కైరూట్ సంస్థకు ప్రభుత్వం రిజిస్టర్ చేయనుంది.
విక్రమ్-1లో వీఐటీ-ఏపీ వర్సిటీ విద్యార్థుల ‘విశ్వ-ఎమ్’
వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక పేలోడ్ ‘విశ్వ-ఎమ్’ (వీఐటీ శాటిలైట్ వేవ్‌లెంగ్త్ అనాలసిస్ మాడ్యూల్)ను విక్రమ్-1 రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. ‘సోలారాస్’ నానో శాటిలైట్‌లో భాగంగా ఈ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపించారు. వివిధ వేవ్‌లెంగ్త్‌లలో సౌర వికిరణాన్ని కొలవడం, విశ్లేషించడం, విద్యా సంస్థల ఉపగ్రహ మిషన్ల కోసం తక్కువ ఖర్చుతో ‘హోస్టెడ్ పేలోడ్ ఆర్కిటెక్చర్’ను ప్రదర్శించడం, భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల కోసం డేటాసెట్‌లను సృష్టించడం, విద్యార్థులకు డిజైన్, ఇంటిగ్రేషన్ నుంచి టెస్టింగ్, మిషన్ ఆపరేషన్స్ వరకు పూర్తిస్థాయి అంతరిక్ష ప్రాజెక్టు అనుభవాన్ని అందించడం.. ఈ పేలోడ్ లక్ష్యమని వర్సిటీ పేర్కొంది.