Share News

మెదడు ఓపెన్‌ సర్జరీకి చెల్లు

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:22 AM

మెదడు తెరవకుండానే చిన్నపాటి కోతతో సరి చేసే మినిమిల్‌ స్కల్‌బేస్‌ సర్జరీ చేయడంలో యువ ఈఎన్‌టీవైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు..

మెదడు ఓపెన్‌ సర్జరీకి చెల్లు

  • స్కల్‌ బేస్‌ సర్జరీలతో త్వరగా కోలుకునే వీలు

  • అపోలో ఆస్పత్రి ఈఎన్‌టీ డాక్టర్‌ వేమూరు తేజస్వి

  • ఆ ఆస్పత్రిలో 360 డిగ్రీల ఈఎన్‌టి-స్కల్‌ బేస్‌ కాన్ఫరెన్స్‌

  • 250 మందికిపైగా సర్జన్లు, అధ్యాపకులు, విద్యార్థుల హాజరు

  • పన్నెండు మంది రోగులకు ఉచితంగా స్కల్‌ బేస్‌ సర్జరీలు

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): మెదడు తెరవకుండానే చిన్నపాటి కోతతో సరి చేసే మినిమిల్‌ స్కల్‌బేస్‌ సర్జరీ చేయడంలో యువ ఈఎన్‌టీవైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు..అపోలో ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం శని, ఆదివారాల్లో ‘360 డిగ్రీల ఈఎన్‌టి-స్క బేస్‌ కాన్ఫరెన్స్‌’ను నిర్వహించింది. దేశ విదేశాల నుంచి ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చిన యువ ఈఎన్‌టి వైద్యులు స్కల్‌ బేస్‌ సర్జరీలో తర్ఫీదు పొందారు. ఇందులో భాగంగా 12 ఏళ్ల నుంచి 71 ఏళ్ల దాకా ఉన్న.. 12 మంది పేద రోగులకు అత్యంత క్లిష్టమైన స్కల్‌ బేస్‌ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు.. అపోలో ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యుడు, కాన్ఫరెన్స్‌ నిర్వహణాధ్యక్షుడు డాక్టర్‌ వేమూరు తేజస్వి తెలిపారు. వీటిని ప్రత్యేక ప్రసారాల ద్వారా యువ వైద్యులకు చూపిస్తూ, సర్జరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైఅవగాహన కల్పించినట్లు ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన ఈ సదస్సుకు 250 మంది పైగా ఈఎన్‌టి సర్జన్స్‌, నిపుణులు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు హాజరయ్యారు. వాస్తవానికి మెదడు కింద భాగంలో ఏర్పడే సాధారణ కణితులు, క్యాన్సర్‌ కణితులను ఇంతకు ముందు ఓపెన్‌ సర్జరీ ద్వారా తొలగించే వాళ్లమని.. దీని వల్ల రోగి 15 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చేదని, రికవరి అయ్యేందుకు చాలా సమయం పట్టేదని డాక్టర్‌ తేజస్వి తెలిపారు. ఇప్పుడు.. అలాంటివాటిని స్కల్‌ బేస్‌ సర్జరీ ద్వారా తొలగిస్తున్నట్లు చెప్పారు. మెదడును తెరవకుండా, ముక్కు, చెవి ద్వారా సన్నని వైద్య పరికరాలను మెదడు కింద భాగం వరకు పంపించి.. కణితులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ సర్జరీ ద్వారా రోగి తలపై ఎలాంటి కోతలు, మచ్చలు ఉండవని.. అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఆస్పత్రిలో కేవలం రెండు, మూడు రోజులు ఉంటే సరిపోతుందని.. సర్జరీ అయిన వారంలో ఉద్యోగం కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని వివరించారు. స్కల్‌బేస్‌ సర్జరీలు చేసే వైద్యుల సంఖ్య అధికం కావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమస్యలుంటే వెంటనే..

గడిచిన ఐదేళ్లలో.. మెదడు కింద భాగంలో కణితులు ఉండే కేసులు బాగా పెరిగాయని డాక్టర్‌ తేజస్వి చెప్పారు. తరచూ తలనొప్పి, దీర్ఘకాలిక సైనస్‌ ఇన్‌ఫెక్షన్లు, ముక్కు బ్లాక్‌ కావడం, ముక్కు నుంచి రక్తస్రావం, వినికిడి తగ్గడం, చెవిలో శబ్దం, తల తిరగడం, గొంతు మారడం, మింగడంలో ఇబ్బంది, గురక, నిద్రలో శ్వాస ఆడకపోవడం, కంటిచూపు సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే.. మెదడులో కణతులు ఉన్నాయని అనుమానించాలని, వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రందించి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Jun 01 , 2026 | 04:22 AM