వీలైనంత త్వరగా సీతారామ నీళ్లు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:16 AM
సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను సమన్వయంతో పరిష్కరించుకుని.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు వీలైనంత త్వరగా సాగునీటి ప్రయోజనాలు అందించేందుకు..
పర్యావరణ అనుమతులపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులు
దోమలవాగు సామర్థ్యం 0.50 టీఎంసీలకు పెంచాలని ఉత్తమ్‌ని కోరిన తుమ్మల నాగేశ్వరరావు
సానుకూలంగా స్పందించిన ఉత్తమ్
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను సమన్వయంతో పరిష్కరించుకుని.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు వీలైనంత త్వరగా సాగునీటి ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌తో తుమ్మల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ)కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో మార్చి 2023 నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఈ న్యాయపరమైన చిక్కులు త్వరగా పరిష్కారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అనుమతులు రాగానే పనులు పునః ప్రారంభించి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. సీతారామ పథకంలో పంప్‌హౌస్-1, పంప్‌హౌస్-2 మధ్య ప్రస్తుతం 0.20 టీఎంసీలుగా ఉన్న దోమలవాగు సామర్థ్యాన్ని 0.50 టీఎంసీలకు పెంచాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు. నిల్వ సామర్థ్యం పెరిగితే పంప్‌హౌస్‌ల మధ్య నీటి లభ్యత స్థిరంగా ఉంటుందని వివరించారు. దీనితోపాటు భూసేకరణ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, జూలూరుపాడు సొరంగం పనులను చేపట్టి పాలేరు జలాశయానికి త్వరగా నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలపై మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారని తుమ్మల వెల్లడించారు.
ఇక సీతారామ ప్రధాన కాలువపై పంప్‌హౌస్-1, 2, 3 మధ్య అవసరమైన చోట్ల ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటు అంశంపైనా మంత్రులు చర్చించారు. సమర్థవంతంగా కాలువ నిర్వహణ, అధిక ప్రవాహమున్నా దెబ్బతినకుండా ఉండటం లక్ష్యంగా ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటుకు పరిశీలన జరపాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారని తుమ్మల తెలిపారు. సత్తుపల్లి ట్రంక్ కాలువలోని యాతలకుంట సొరంగం ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని వెల్లడించారు. ఇక అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక భూములు ఆయిల్‌పామ్ సాగులో ఉన్నందున, సంప్రదాయ కాలువలకు బదులు పైపుల ద్వారా సాగునీటి పంపిణీ (పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్) సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ఆయిల్‌పామ్ తోటలకు నిరంతరం, నియంత్రిత పద్ధతిలో నీరు అందించేందుకు పైప్డ్ ఇరిగేషన్ విధానం మరింత అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
2 దశల్లో 48 గోదాముల నిర్మాణం: తుమ్మల
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని గోదాముల సామర్థ్యాన్ని మరో 5 లక్షల టన్నుల మేర పెంచుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో నిర్మిస్తున్న 17 గోదాములను 2027 జనవరి నాటికి పూర్తిచేసి 2.12 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రెండో దశలో 31 గోదాములను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసి మరో 3.66 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ పరిధిలో 52 సొంత గోదాములు ఉండగా, వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 6 లక్షల టన్నులని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారా మరో 3.25 లక్షల టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.