Share News

కేసీఆర్‌పై చార్జిషీట్‌?

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:51 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండు వారాల్లో నేరాభియోగ పత్రం (చార్జిషీట్‌) దాఖలు చేయాలని సిట్‌ నిర్ణయించినట్టు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు, మరికొందరు ప్రముఖుల పాత్రపై ....

కేసీఆర్‌పై చార్జిషీట్‌?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో 2 వారాల్లో దాఖలుకు సిట్‌ ఏర్పాట్లు

  • పక్కా ఆధారాలతో అభియోగాలు

  • ఆర్థిక లబ్ధి, రాజకీయప్రయోజనాలపై ఫోకస్‌

  • సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు

  • అప్రూవర్‌గా ఒక ఐఏఎస్‌ అధికారి!

  • నిందితుల జాబితాలో ప్రభాకర్‌రావు కుమారుడు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండు వారాల్లో నేరాభియోగ పత్రం (చార్జిషీట్‌) దాఖలు చేయాలని సిట్‌ నిర్ణయించినట్టు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు, మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. చార్జిషీట్‌ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. సిట్‌ చీఫ్‌ బుధవారం దర్యాప్తు బృందంతో సమావేశమయ్యారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని చార్జిషీట్‌ వేసేలోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కొత్తగా మరో ఐదారుగురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును అధికారులు రెండు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అధికార మార్గాల్లో జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ (మావోయిస్టుల పేరిట) ఒకటికాగా, అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో జరిగిన ట్యాపింగ్‌ వ్యవహారం మరొకటి. ఇందులో అధికారిక మార్గంలో జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఆయన బృందం, నిఘా, బెదిరింపులకు సంబంధించి అప్పటి టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ రాధాకిషన్‌రావు పాత్రపై ఇప్పటివరకు లభించిన ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలుకు సిట్‌ అధికారులు సన్నద్ధమైనట్టు తెలిసింది. ట్యాపింగ్‌ కోసం ఆదేశాలు ఇవ్వడం, రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందడం నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, నాటి మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతో్‌షరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖుల పాత్రపై పూర్తి సాక్ష్యాధారాలతో నేరాభియోగాలు నమోదు చేయనున్నట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతులిచ్చిన రివ్యూ కమిటీలోని అధికారులను ఈ కేసులో సాక్షులుగా, ఒక ఐఏఎస్‌ అధికారిని అప్రూవర్‌గా చూపించనున్నట్టు తెలిసింది. ట్యాపింగ్‌ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని సదరు ఐఏఎస్‌ అధికారి ద్వారా భూముల గోల్‌మాల్‌ జరిగిన వ్యవహారంలో లబ్ధిపొందిన వారి ఆధారాలను సిట్‌ అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావును నిందితుల జాబితాలోకి చేర్చే అవకాశాలున్నట్టు తెలిసింది. కేసు నమోదై రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన సిట్‌ దర్యాప్తును సమీక్షించుకుని, తదుపరి చర్యల కోసం ఒక వ్యూహన్ని రూపొందించుకున్నట్టు సమాచారం.

Updated Date - Feb 05 , 2026 | 04:51 AM