Share News

కేసీఆర్‌ వయా కవిత, సంతోష్‌!

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:55 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు..

కేసీఆర్‌ వయా కవిత, సంతోష్‌!

  • మాజీ ఎంపీ సంతో్‌షను విచారించడానికి సిట్‌ సన్నద్ధం.. కవితకు నోటీసులు రెడీ

  • రాధాకిషన్‌ వాంగ్మూలంలో ‘పెద్దాయన’ పేరు.. స్లిప్పులపై ఫోన్‌ నంబర్లు

  • బీఆర్‌ఎ్‌సలోని బాధితులను వరుసగా విచారించే అవకాశం

  • అన్ని లింకులను కలిపి ‘రాజకీయ కోణం’ గుట్టు తేల్చేయత్నం

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు.. ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోణం కూపీలాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావును మంగళవారం విచారించిన సిట్‌ అధికారులు.. ఆయన ఫోన్‌, ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయిన వివరాలు చూపించి.. కీలక అంశాలను రాబట్టడానికి ప్రయత్నించారు. ఇక తన భర్త ఫోన్‌ ట్యాప్‌ అయిందని ఆరోపిస్తున్న కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్‌లనూ విచారించాలని.. వారి వాంగ్మూలం కేసుకు బలంగా మారుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నాటి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండి, చక్రం తిప్పిన సంతో్‌షరావు పాత్రపై సిట్‌ విచారణ జరిపే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేసీఆర్‌ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డి విచారణలో వెల్లడైన అంశాలు, రాధాకిషన్‌రావు వాంగ్మూలంలోని వివరాల ఆధారంగా సంతో్‌షరావును ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం. నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేత్తో రాసిన కొన్ని ఫోన్‌ నంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్‌ఐబీలోని ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించానని రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చారు. ఆ చేతిరాత ఎవరిది? ఎవరి ద్వారా ఆ స్లిప్పులు రాధాకిషన్‌రావుకు చేరాయి? ఎవరు ఆదేశిస్తే ఆ నంబర్లను పంపారనే అంశాలను తేల్చేందుకు సంతో్‌షరావును విచారించడం తప్పనిసరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వరుసగా లింకులను తేల్చుతూ చివరికి ‘పెద్దాయన’ అంశం తేలేదాకా పక్కా ఆధారాలతో ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అప్పటి బీఆర్‌ఎస్‌ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీత, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, శంభీపూర్‌ రాజుతోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన ఒక మహిళా నేత ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు సిట్‌ అధికారులు గుర్తించారని సమాచారం. వీరందరి విచారణ పూర్తయ్యాక పెద్దాయన అంశాన్ని ముందుకు తేవాలని భావిస్తున్నట్టు తెలిసింది.


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా..!

గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక అంశమైన నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సిట్‌ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఆ వ్యవహారానికి సంబంధించి కొందరి ఫోన్‌ సంభాషణలను నాటి సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో వినిపించడం, ఆ ఆడియోల సీడీలను సుప్రీంకోర్టుకు పంపిన క్రమంలో.. ఆ ఆడియోలను కేసీఆర్‌కు ఎవరిచ్చారు? నందకుమార్‌, స్వామీజీ మధ్య సంభాషణలు రికార్డు చేయాలని ఎవరు ఆదేశించారనే అంశాలను సిట్‌ అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌, నేతలు ఈటెల రాజేందర్‌, వివేక్‌, రాజగోపాల్‌రెడ్డి, వారి అనుచరుల మధ్య జరిగిన సంభాషణలను విని.. భారీగా నగదును పట్టుకోవడం వంటివాటిపై దృష్టిపెట్టినట్టు తెలిసింది.

Updated Date - Jan 22 , 2026 | 04:55 AM