Share News

భూదాన్‌ భూముల అక్రమాల్లోనూ పెద్దలు!?

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:07 AM

అనధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి సిట్‌ అధికారులు బలమైన సాక్ష్యాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది.

భూదాన్‌ భూముల అక్రమాల్లోనూ పెద్దలు!?

  • ట్యాపింగ్‌తో బెదిరించి, ధరణిలో పనులు చేయించుకున్నారు

  • గత్యంతరం లేని పరిస్థితుల్లో చేశాం

  • ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలం.. సిట్‌కు బలమైన సాక్ష్యం

  • కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతో్‌షల విచారణలో ఇదే కీలకం!

  • పక్కా ఆధారాలను సేకరిస్తున్న సిట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): అనధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి సిట్‌ అధికారులు బలమైన సాక్ష్యాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలం ద్వారా ఈ సాక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లనే కాకుండా నాటి ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారన్న ఆరోపణలపై సిట్‌ బలమైన సాక్ష్యాధారాలను సేకరిస్తోంది. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సంభాషణలు, కదలికలపైనా నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు బృందంతో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావులు నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సాక్ష్యమే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతో్‌షరావుల విచారణలో కీలక అంశంగా మారినట్లు తెలుస్తోంది. భూదందా, రూ.వందల కోట్ల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి అమేయ్‌కుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈడీ విచారణకు హాజరై ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారని.. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుల బృందం నేరుగా బెదిరించారని, తనతో ధరణిలో కొన్ని పనులు చేయించుకున్నారన్న విషయాలను వెల్లడించారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావు సైతం ఈ భూముల వ్యవహరంలో ఉన్నాడని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. భూదాన్‌ భూముల అక్రమాల్లోనూ పెద్దల పాత్ర ఉందని, గత్యంతరం లేని పరిస్ధితుల్లో తాను ఆ పనులు చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఈడీ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని ఆయన హమీ ఇచ్చినట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నుంచి సేకరించిన సిట్‌ అధికారులు తాజాగా జరిగిన కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతో్‌షల విచారణలో పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


అప్రూవర్‌గా ఐఏఎస్‌..?

దరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల గోల్‌మాల్‌ జరిగిందని గతంలోనే కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. భూదాన్‌ భూములను కొల్లగొట్టారని అందులో నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నాయకుడితో పాటు నాటి పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్‌నే బెదిరించి, తమ భూదందాకు అనుకూలంగా మార్చుకున్న వారిలో ట్యాపింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలూ ఉంటారని సిట్‌ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అమేయ్‌కుమార్‌ను అప్రూవర్‌గా మార్చుకోవడానికి సిట్‌ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ బెదిరింపుల నిరూపణకు ఇదో సజీవసాక్ష్యం అవుతుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే సంధ్య శ్రీధర్‌ కేసు ఒకటి సిద్ధంగా ఉందని, కోట్ల రూపాయల డబ్బు చేతులు మారడానికి సంబంధించి బీజేపీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం, ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ప్రతి ఆరోపణకు సంబంధించి ఒకట్రెండు పక్కా ఆధారాలు సిద్ధం చేసుకున్న తర్వాతే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతోష్‌ మరికొందరి పేర్లను చార్జిషీట్‌లో పొందుపరచనున్నారని సమాచారం. సిట్‌ను బలోపేతం చేస్తూ నూతన అధికారుల బృందాన్ని రంగంలోకి దింపి పర్యవేక్షణ బాధ్యతలను సీపీ సజ్జనార్‌కు అప్పగించడంతో ఈ కేసులో ఎక్కడెక్కడి తీగలో కదులుతున్నాయి. అవి ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటాయోనని బీఆర్‌ఎస్‌ పెద్దలు కలవరపడుతున్నట్లు సమాచారం.

Updated Date - Feb 06 , 2026 | 04:07 AM