రోహిత్ ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:50 AM
మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఇప్పటి వరకు 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించిన్నట్లు తెలుస్తోంది.
గుర్తించిన అధికారులు.. సిట్ కస్టడీకి నిందితులు
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఇప్పటి వరకు 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించిన్నట్లు తెలుస్తోంది. మరిన్ని కీలక విషయాలు రాబట్టడానికి మరో ఐదు రోజుల పాటు నిందితులను కస్టడీ ఇవ్వాలని శుక్రవారం అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు రెండు రోజులే కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డిని ఇద్దరినీ కస్టడీకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో నిందితుడు నమిత్ శర్మకు కోర్టు కస్టడీకి ఇవ్వలేదు. కాగా, గత రెండు రోజుల కస్టడీలో పలు కీలక విషయాలను సిట్ అధికారులు రాబట్టారు. రోహిత్‌రెడ్డి దుబాయ్‌లో డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనడంతో పాటు పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆరు నెలల క్రితం దుబాయ్‌లో జరిగిన ఓ డ్రగ్స్ పార్టీలో ఒక వ్యక్తికి డ్రగ్స్ అధిక డోస్ కావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే బెంగుళూరు, గోవాలో కూడా డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం.