తోబుట్టువులకు సోదరి టోకరా
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:04 AM
ఐదుగురు తోబుట్టువులు సమానంగా పంచుకోవాల్సిన భూములను తప్పుడు ధ్రువపత్రాలతో ఒక్కరే సొంతం చేసుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకున్న ఘటన జోగుళాంబ ...
తప్పుడు ధ్రువపత్రాలతో భూముల రిజిస్ర్టేషన్
న్యాయం కోసం తహసీల్దార్ కాళ్లు మొక్కిన బాధిత మహిళలు
మానవపాడు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఐదుగురు తోబుట్టువులు సమానంగా పంచుకోవాల్సిన భూములను తప్పుడు ధ్రువపత్రాలతో ఒక్కరే సొంతం చేసుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో చోటుచేసుకుంది. బాధిత మహిళల వివరాల ప్రకారం.. బోరవెల్లికి చెందిన కుర్వ బిచ్చన్న, మంగమ్మ దంపతులకు ఐదుగురు ఆడబిడ్డలు కొటమ్మ, లక్ష్మీదేవి, వరలక్ష్మి, సుమిత్రమ్మ, సుజాత ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు మరణించారు. తల్లి పేరుపై వారి స్వగ్రామంలోని ఒక సర్వే నంబరులో 2.16 ఎకరాలు, మరో సర్వే నంబరులో ఎకరం, ధర్మవరం శివారులో 1.37 ఎకరాల భూమి ఉంది. వీటిపై ఐదుగురు కుమార్తెలకు సమానహక్కు ఉండగా.. తోబుట్టువులకు తెలియకుండా వరలక్ష్మి ఐదు నెలల క్రితం తప్పుడు ధ్రువపత్రాలతో మొత్తం భూములను రిజిస్ర్టేషన్ చేయించుకుంది. ఈ విషయం బయటపడటంతో లక్ష్మీదేవి, సుజాత సోమవారం తహసీల్దార్ జోషి శ్రీనివా్‌సశర్మను కలిసి సమస్యను వివరించారు. తమకు న్యాయం చేయాలని ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. తహసీల్దార్ స్పందిస్తూ.. తప్పుడు రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలంటూ ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవాలని వారికి సూచించారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు.