సిరిసిల్లలో ఉద్రిక్తత
ABN , Publish Date - May 19 , 2026 | 04:56 AM
బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు సిరిసిల్లలో ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ...
పోటాపోటీగా బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా
బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయాలన్న బీఆర్‌ఎస్
ఇంటర్ విద్యార్థుల మృతిపై కేటీఆర్‌ను శిక్షించాలన్న బీజేపీ
సిరిసిల్ల, మే 18(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు సిరిసిల్లలో ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. బండి సంజయ్‌తో పాటు భగీరథ్‌తో ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీని ప్రదర్శించారు. మరోవైపు 22 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బలితీసుకున్న కేటీఆర్‌ను అరెస్టు చేయాలంటూ ఇక్కడే బీజేపీ శ్రేణులు కూడా నిరసన చేపట్టాయి. సిట్ ఏర్పాటు చేసి గ్లోబరినా సంస్థపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఇరు వర్గాలు ఒకేసారి రావడంతో పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎస్పీ మహేష్, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. ఒక దశలో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీలకు పని చెప్పారు. చివరకు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయినా మరికొందరు బీజేపీ కార్యకర్తలు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. పోటీగా తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. భారీ ఫ్లెక్సీతో రోడ్డుపై బైఠాయించారు. ఫ్లెక్సీని తొలగించే క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఫ్లెక్సీని తొలగించారు.