సర్..‘దిద్దు’తారా..
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:44 AM
చేయని తప్పుకు అధికారులు ఓటర్లను ముప్పుతిప్పలు పెడుతూ సర్ నోటీసులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, మ్యాపింగ్ ప్రకారం ఓటరు
కరీంనగర్ టౌన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): చేయని తప్పుకు అధికారులు ఓటర్లను ముప్పుతిప్పలు పెడుతూ సర్ నోటీసులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, మ్యాపింగ్ ప్రకారం ఓటరు పేరు, తండ్రి పేరు 2002 నాటి సర్ జాబితాకు సరిపోక పోవడం లాంటి కారణాలతో ఓటర్లకు నోటీసులు జారీచేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 64 వేల మంది ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్‌వో) నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఫ 20 ప్రత్యేక కౌంటర్లు
ఓవైపు బీఎల్‌వోస్ ఓటర్లకు నోటీసులను పంపిణీ చేస్తుండగా మరోవైపు ఆ తప్పులను సరిదిద్దేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 22 వరకు ముసాయిదా ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్ది తుది జాబితాను రూపొందించే విధంగా నగరంలోని 258 మంది బీఎల్‌వోలకు రోజుకు కొంత మంది చొప్పున తేదీలను ఖరారు చేశారు. ఆయా తేదీల్లోనే బీఎల్‌వో పరిధిలోని ఓటర్లు తగిన ఆధారాలను తీసుకొని వచ్చి వారు సూచించిన కౌంటర్లలో సరిదిద్దు కోవాలంటూ నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి ఈ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టగా శుక్రవారం రాఖీపౌర్ణమి పండుగ అయినా వారికి కేటాయించిన తేదీల్లోనే ఆధారాలను చూపించాలని నోటీసులు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో బీఎల్‌వోల వద్దకు వచ్చి క్యూకట్టారు. నోటీసుల్లో 2002 నాటి ఓటరు జాబితా ప్రకారంగా ఏయే అంశాలు మ్యాపింగ్ కాలేదనే విషయం కానీ, ఇటీవల సమర్పించిన ఎన్యూమరేసన్ ఫారాల్లో నింపిన వివరాల్లో తేడా ఉన్న తప్పులను కానీ తెలపలేదు. ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలను పట్టుకొని కొందరు, తమ వద్ద అలాంటి ఆధారాలు లేవని మరికొందరు బీఎల్‌వోతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నోటీసులు జారీ చేశామని, విధిగా ఆధారాలు చూపించాలంటూ బీఎల్‌వోలు, ఇతర అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కొందరు ఓటర్లు ఓటు లేకున్నా పర్వాలేదంటూ ఆగ్రహంతో వెనుదిరిగారు.
ఫ ఓటర్ల ఇబ్బందులు
దిద్దుబాటు కోసం ఎక్కడో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో డ్యూటీ చేసుకునే, చదువుకునే తమ పిల్లలను రావాలని చెప్పడమేమిటనీ, తామే ఆధారాలు సమర్పిస్తామని, ఆధారాలతో సరిచేయాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగులు ఆధారాలు చూపించలేక ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.64 లక్షల ఓటర్లలో 93 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీచేశారు. ఇంత మంది తప్పులు ఎలా జరుగుతాయని, ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకునే ముందు ఆధారాలను పరిశీలించడం, డిజిటలైజేషన్ చేసే ముందు తప్పులు దొర్లకుండా చూస్తే ఇంత మందికి నోటీసులు రావని అంటున్నారు. ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకుండా హడావుడిగా బీఎల్‌వోలతో ఫారాలను పంపించి, వాటిని పరిశీలించకుండానే తిరిగి తీసుకోవడంతోనే ఇలాంటి గందరగోళం తలెత్తిందని, ఇప్పటికైనా అర్హులైన ఓటర్లను ఇబ్బంది పెట్టకుండా వీలైనంత దిద్దుబాటు విషయంలో వీలైనంతగా వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ పేరు ముందుండి... ఇంటిపేరు వెనక్కి రాశారు...
- అసోడ బుచ్చయ్య
ఫారంలో నా పేరు ముందు రాసి మా ఇంటి పేరు వెనక్కి రాశారు. దీనిలో తప్పేముంది. దీనికి కూడా నోటీసు జారీ చేశారు. నేను గతంలో ఇచ్చిన ఫారంలో సరిగానే రాశాను. నేను చేయని తప్పుకు ఆధారాలు చూపించాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వాటిని అధికారులు సరిచేస్తే సరిపోతుంది.
ఫ స్పెల్లింగ్ మిస్టేక్‌తో నోటీసు ఇచ్చారు...
- పొనుగోటి రేణుక
బీఎల్‌లో ఇచ్చిన ఫారాలను సరిగానే పూర్తిచేసి ఇచ్చాము... ఓటరు జాబితాలో పేరులో స్పెల్టింగ్ మిస్టేక్ చేశారు.. దానికి నాకు నోటీసు జారీ చేశారు. నేను చేయని తప్పుకు గంటల తరబడి ఇక్కడ ఇబ్బంది పడాల్సి వచ్చింది.