Share News

మూడో బాక్స్‌ నింపితే చాలు..

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:09 AM

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ నింపే విధానంపై ఓటర్లలో ఉన్న పలు సందేహాలకు అధికారులు స్పష్టతనిచ్చారు.

మూడో బాక్స్‌ నింపితే చాలు..

  • ఓటరు నమోదు సులువు!.. పాత వివరాలు తెలియక పోయినా ఇబ్బంది లేదు

  • ప్రస్తుత వివరాలతోనే ఓటరు అర్హత తేల్చనున్న బీఎల్‌వోలు

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ నింపే విధానంపై ఓటర్లలో ఉన్న పలు సందేహాలకు అధికారులు స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా 2002 నాటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను నమోదు చేసినా దరఖాస్తును స్వీకరిస్తామని ఎన్నికల విభాగాలు చెబుతున్నాయి. ఎన్యుమరేషన్‌ ఫారంలో ఓటరు వివరాల నమోదుకు మూడు బాక్సులు కేటాయించారు. మొదటి రెండు బాక్సుల్లో.. 2002 నాటి ఓటరు జాబితా వివరాలు, ఓటరు మ్యాపింగ్‌ కోసం తండ్రి, తల్లి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. మూడో బాక్సులో మాత్రం సదరు ఓటరుకు సంబంధించిన ప్రస్తుత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, పాత రికార్డులు, 2002 నాటి చిరునామా తెలియని వారు మొదటి రెండు బాక్సులను ఖాళీగా వదిలేసినా దరఖాస్తు తిరస్కరణకు గురికాదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పేరు, చిరునామా, కుటుంబ వివరాలు నమోదుచేసి దరఖాస్తుపై సంతకం చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేేస్త సరిపోతుందని చెబుతున్నారు. ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు కూడా పాత వివరాలు లేకుండానే ఫారాన్ని సమర్పించవచ్చని సూచించారు. దరఖాస్తులు అందిన తర్వాత బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సదరు ఓటరు వివరాలను.. అందుబాటులో ఉన్న ఆధారాలను సరిపోల్చుకున్నాక అర్హులైన వారిని డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో చేరుస్తారు. పాత వివరాలు లేవనే కారణంతో దరఖాస్తులు చేసుకోకుండా ఉండిపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. అయితే, తుది నిర్ణయం మాత్రం భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి ధ్రువీకరణ ఆధారంగానే ఉంటుందని వివరించారు.

Updated Date - Jul 15 , 2026 | 06:10 AM