సర్‌లో తప్పుల తడకగా తెలుగు పేర్లు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:11 AM
ఓటర్ల జాబితాను వంద శాతం పక్కాగా, ఎలాంటి తప్పులు లేకుండా అప్‌డేట్ చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ...
యాప్‌లో ఎంట్రీ సమయంలో వివరాలు..తెలుగులోకి మారే ప్రక్రియలో దోషాలు
గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాలను నింపి ఆన్‌లైన్ చేస్తున్న బీఎల్‌ఏలు
టౌన్లలో నకిలీ ఓట్ల బాగోతం బట్టబయలు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాను వంద శాతం పక్కాగా, ఎలాంటి తప్పులు లేకుండా అప్‌డేట్ చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాల్లో తమ వివరాలు రాసి బీఎల్‌వోలకు ఇచ్చిన తర్వాత.. వారు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో గందరగోళం నెలకొంటోంది. ఇంగ్లి్‌షలో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత తెలుగులోకి మారేటప్పటికి అనేక అక్షర దోషాలు, తప్పులు దొర్లి అర్థం మారిపోతోంది. కొన్నిసార్లు వాటిని పలకడం కూడా కష్టంగా ఉంటోంది. హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో ఉండే ఒక ఓటరు తాను నివాసం ఉండే ప్రాంతం పేరు రాయగా... అది చివరికి బచ్చుపల్లిగా మారిపోయింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఓ గ్రామంలో ఒకరి ఇంటిపేరు సుడిగాలి కాగా... అది సుడిగాలియాగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండకు చెందిన వాసిరెడ్డి వెంకట నరేశ్ పేరు వెంకట నరీషుగా మారిపోయింది. ఇలా ఇంటిపేరు, ఓటర్ల పేరు, ప్రాంతాల పేర్లు మారిపోవడంతో ఓటర్లు తల పట్టుకుంటున్నారు. అధికారులు మాత్రం ఇలాంటి తప్పు లు దొర్లడం సహజమేనని చెబుతున్నారు. ఇంగ్లి్‌షలో టైప్ చేసిన పేర్లు తెలుగులోకి ఆటోమెటిక్‌గా మారినప్పుడు ఇలాగే వస్తుంటాయని అంటున్నారు. వాటి గురించి ఆందోళన అవసరం లేదని, తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుందని, అప్పుడు సరిచేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, అప్పుడు కూడా ఇలాగే వస్తే పరిస్థితి ఏంటని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చక్రం తిప్పుతున్న బీఎల్‌ఏలు
సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ఏజెంట్లు (బీఎల్‌ఏ) చక్రం తిప్పుతున్నారు. ఈసీఐ నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) నిర్వర్తించాల్సిన పనులన్నీ ఈ బూత్ లెవల్ ఏజెంట్లే (బీఎల్‌ఏ) చేసేస్తున్నారు. బీఎల్‌వోల వద్ద రహస్యంగా ఉండాల్సిన ప్రత్యేక యాప్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా బీఎల్‌ఏల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వాలి. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌ఏలే పూరిస్తున్నారు. తమకు తెలిసిన, తమ వాళ్ల ఆఽధార్ కార్డులు, ఫొటోలు తీసుకుని నింపేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫారాల్లోని వివరాలను బీఎల్‌వోలు తమ ఆఫీసుల్లో ఆన్‌లైన్ చేయాలి. అందుకోసం వారికి ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఆ యాప్‌లోకి ప్రవేశించేందుకు ప్రతి బీఎల్‌వోకు ప్రత్యేక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. వీటిని రహస్యంగా ఉంచాలి. కానీ, అవి కూడా బీఎల్‌ఏల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.
బయటపడుతున్న నకిలీ ఓట్ల బాగోతం
సర్ ప్రక్రియలో నకిలీ ఓట్ల బాగోతం బయటపడుతోంది. ప్రత్యేకించి ఒకే ఇంటి నంబరు, ఫోన్ నంబరుతో వందల ఓట్లు ఉన్న విషయం వెలుగులోకి వస్తోంది. గతంలో ఖమ్మంలోని ఓ డివిజన్‌లో ఒకే ఇంటి నంబర్‌పై సుమారు 150 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా గండిపేట మండలంలోని ఓ వార్డులో ఒకే ఇంటి నంబరు, ఫోన్ నంబర్‌పై ఏకంగా 700 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సర్‌లో భాగంగా వాటన్నింటిని తొలగించనున్నారు. ఈ ఓట్ల మతలబు వెనుక గత అధికార పార్టీకి చెందిన ఓ నేత ఉన్నట్లు గుర్తించారు.