kumaram bheem asifabad- సర్ అమలుకు సన్నాహాలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:16 PM
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నోటిఫికేషన్ మార్చిలో వెలువడే అవకా శాలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది
- కొనసాగుతున్న బీఎల్‌వోల ఇంటింటి సర్వే
- జిల్లాలో 68 శాతం పూర్తి చేసిన సిబ్బంది
- ఈఆర్‌వోల పర్యవేక్షణ
కాగజ్‌నగర్ టౌన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నోటిఫికేషన్ మార్చిలో వెలువడే అవకా శాలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే సర్వే 60 శాతంపైగా పూర్తయినట్లు గణాంకాలు ఉన్నాయి. ఓటరు జాబితాలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ఓటరు జాబితా 2025 జాబితాను 2002 ఓటర్లు జాబితాతో సరిపోల్చే మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించేందుకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు చూపని పక్షంలో ఓటును తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. జి ల్లా వ్యాప్తంగా ఇప్పటికే 68 శాతం పైగా ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.
- రెండు చోట్ల ఓటు ఉంటే..
ఒక జిల్లా నుంచి మరో జిల్లా వచ్చి రెండు చోట్ల ఓటున్న వారిని గుర్తించి ఓట్లను తొలగిస్తున్నారు. బీఎల్‌వోలు రెండు విధాలుగా మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెబుతున్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను సరి పోల్చడంతో పాటు 2002 జాబితాలో ఓటర్ల వివరాలు సేకరించి ఆ తరువాత ఓటు హక్కు తదితర సమాచారంతో మ్యాపింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతా ల్లో చాలా మంది ఓటర్లు ఇటీవల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాలా చోట్ల మృతి చెందిన వారు కూడా ప్రస్తుత జాబితాల్లో వందలాది మంది ఉన్నారు. అలాగే రెండు చోట్ల ఓట్లున్న వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిచండం లో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కనిపించని వారిని వివరాలు ఆరా తీసి స్థానికంగా ఉన్న వారిని అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,65,749 మంది ఓటర్లు ఉన్నారు. కాగా సిర్పూర్ నియోజక వర్గంలో 2,34,260 మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. సుమా రు 67.84 శాతం పూర్తి చేశారు. కాగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,31,489 మంది మ్యాపింగ్ పూర్తయిది. ఇది 68.76శాతంగా ఉంది.
- చివరి సారిగా 2002లో..
ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2002లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో భాగంగా 2002 జాబితాలోని ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను 2025తో పోల్చుతున్నారు. పాత జాబితాలోని ఓటర్లు ఎవరైనా మృతి చెంది ఉంటే తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) మండలానికి ఏఈఆర్‌వోలు సిబ్బంది ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా చేస్తూ త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా పార్టీల నాయకులతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏఈఆర్‌వో, ఈఆర్ వోలు పర్యవేక్షిస్తూ ఎస్‌ఐఆర్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను వేగవంతం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఓటర్ మ్యాపింగ్, ఓటర్ల తొలగింపు చేర్పుల్లో సందేహాలు, తదితర ప్రక్రియపై వినతి పత్రాలు ఇప్పటికే అందజేశారు.