Share News

సర్‌’ నోటీసు నాకూ వచ్చింది

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:42 AM

ఎన్నికల కమిషన్‌ చేపడుతున్న ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా తనకు కూడా నోటీసు వచ్చిందని జస్టిస్‌ పి.శ్యాంకోషీ వ్యాఖ్యానించారు. నోటీసుకు వివరణ ఇవ్వాలని, అలా ఇచ్చిన తర్వాత కూడా ఓటు తొలగిస్తే కోర్టుకు రావచ్చని పిటిషనర్లకు సూచించారు.

సర్‌’ నోటీసు నాకూ వచ్చింది
syamquoshi

  • నోటీసు వస్తే సమాధానం ఇవ్వండి

  • ఇచ్చిన తర్వాత కూడా ఓటు తొలగిస్తే కోర్టుకు రండి

  • పిటిషనర్లకు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

  • వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌కు నోటీసు

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ చేపడుతున్న ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా తనకు కూడా నోటీసు వచ్చిందని జస్టిస్‌ పి.శ్యాంకోషీ వ్యాఖ్యానించారు. నోటీసుకు వివరణ ఇవ్వాలని, అలా ఇచ్చిన తర్వాత కూడా ఓటు తొలగిస్తే కోర్టుకు రావచ్చని పిటిషనర్లకు సూచించారు. అలాగే, ఓ పిటిషనర్‌కు నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించడంపై వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. ‘సర్‌’ ప్రక్రియ చేపడుతున్న తీరు సరిగా లేదని, తాము ఇచ్చిన వివరణ తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన ఎంక్యూ మసూద్‌, తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ శ్యాం కోషీ, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌ రావుల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదిస్తూ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా తమ ఓట్లు తొలగించారని తెలిపారు. మరో పిటిషనర్‌కు నోటీసు ఇచ్చారని, కానీ, విచారణకు హాజరైన తర్వాత కూడా ఎలాంటి వివరణ తీసుకోలేదని వివరించారు. ‘సర్‌’ ప్రక్రియలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని ఉపయోగిస్తున్నారని, మానవ జోక్యం లేకుండా, వ్యక్తిగత పరిశీలన చేయకుండా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ‘‘నోటీసు ఎందుకు జారీ అయింది? ఏం తప్పులున్నాయనే అంశాలేవీ పౌరులకు తెలియడం లేదు. ‘సర్‌’ ప్రక్రియలో ఎక్కడా పారదర్శకత లేదు. విచారణకు పిలిచి డాక్యుమెంట్లు తీసుకుని పంపిస్తున్నారు. వివరణ ఇవ్వడానికి అనుమతించడం లేదు. పూర్తి అశాస్ర్తీయంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారన్న వాస్తవాన్ని ఎవరూ గుర్తించడం లేదు’’ అని వివరించారు.


మూకుమ్మడిగా ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడి అంటూ నల్సార్‌ యూనివర్సిటీలో ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇందుకు ఈసీ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. పిటిషనర్ల ఓట్ల పరిస్థితిపై వివరణ ఇస్తామని చెప్పారు. ‘‘ప్రాథమికంగా పరిశీలిస్తే.. పూర్వ, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో తండ్రి పేరులో తేడా ఉంది. ఒకవేళ ఓటు తొలగిపోతే మళ్లీ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవచ్చు’’ అని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ లిఖితపూర్వక వివరణ కోసం విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

Updated Date - Oct 06 , 2026 | 06:42 AM