Share News

‘సర్‌’.. కష్టాలు..

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:22 AM

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకువచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా హడావిడిగా ఎన్యూమరేషన్‌ ఫారాలు

‘సర్‌’.. కష్టాలు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకువచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా హడావిడిగా ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి వారంలోగా తిరిగి ఇవ్వాలంటూ బీఎల్వోలు చెప్పి వెళ్లడం మినహా వాటిపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఎస్‌ఐఆర్‌ ఫారం నింపడం సమస్యగానే మారింది. ఎన్యూమరేషన్‌ పారాలను ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం భర్తీ చేసి బీఎల్వోలకు ఇస్తే ఫారాలను డిజిటలైజేషన్‌ చేస్తారు. కానీ ఓటర్లు ఈఎఫ్‌ పారాలను నింపేందుకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,75,694 మంది ఓటర్లు ఉండగా 4,64,978 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలను అందించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా పూర్తిచేసే దిశగా కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ స్వయంగా పోలింగ్‌ బూత్‌ స్థాయిలు పరిశీలించారు.

సవాల్‌గా ఎన్యూమరేషన్‌ ఫారం భర్తీ

జిల్లాలో ఎన్యూమరేషన్‌ పారాలు పొందిన ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇచ్చిన ఫార్మాట్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. చాలాచోట్ల పారాలను పంపిణీ చేస్తున్న బీల్వోలు, అధికారులు ఎలా భర్తీ చేయాలో అవగాహన కల్పించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు ఫారం ఎలా నింపాలో తెలియక చదువుకున్న వారి చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఫారం నింపుకోవడంలో గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్వోలు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఓటరు జాబితా తెలియక తంటాలు

ఓటర్‌ ప్రత్యేక సవరణ ఎన్యూమరేషన్‌ ఫారం మొదటి కాలంలో 2002 నాటి ఓటర్‌ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓటర్‌ జాబితాలో పేరు ఉన్నప్పటికీ 2002 ఓటర్‌ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఫోర్టల్‌లో, బీఎల్వోల వద్ద పాత ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ రూపంలో ఉంది. మొబైల్‌లో చూసి వివరాలు చెప్తున్నారు. ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చి భర్తీ చేసి ఇవ్వాలని బీఎల్వోలు చెప్పి వెళ్లారు. అనుమానం ఉంటే ఫారం పైభాగంలో బీఎల్‌వో నంబర్‌, పేరు కూడా ఉంది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకునే వీలు ఉన్నప్పటికీ చాలామంది బీఎల్వోలు సరైన సమాధానాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 2002 తర్వాత ఓటు హక్కు పొందితే వారి తల్లిదండ్రుల ఓటర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలకు తల్లిదండ్రుల ఓటర్‌ వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లల ఓట్లు మరోచోట నమోదు చేసుకుంటే ఆ వివరాలు తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త కోడళ్లూ.. ఓటు జాగ్రత్త..

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఓటర్ల పైనే ఉంది. ప్రధానంగా 2002 తర్వాత అత్తారింటిలో అడుగుపెట్టిన కొత్త కోడళ్లు ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్తారింటిలో అడుగుపెట్టిన కోడలు ఇంటిపేరు మారుతుంది. కానీ స్పెషల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ కోడళ్ల వంశవృక్షాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. 2002లో సర్‌ ప్రక్రియలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో స్పష్టంగా నమోదు చేయాలి. తమ తల్లిదండ్రుల ఓటర్‌ జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కోడలుగా వచ్చిన యువతుల వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చదువుకున్న వారు గతంలో ఓటు హక్కు వివరాలు తెలిసిన వారైతే నమోదు చేస్తున్నారు. వివరాలు తెలియని నిరక్షరాస్యులకు ప్రశ్నార్థకంగానే నిలుస్తోంది.

Updated Date - Jul 02 , 2026 | 01:22 AM