Share News

ఇదేంటి ‘సర్‌’!

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:30 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులైనా బాలారిష్టాలను అధిగమించలేదు. ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలను ముద్రించి ఆయా పోలింగ్‌ బూత్‌ల..

ఇదేంటి ‘సర్‌’!

  • 4 వేల బూత్‌లకు చేరని ఎన్యుమరేషన్‌ ఫారాలు

  • చదువు, సాంకేతికత లేని వారికీ బాధ్యతలు

  • ఓటర్లకు సాయం చేయలేని స్థితిలో బీఎల్‌వోలు

  • 2002 ఓటర్‌ జాబితాలో పేరు వెతకడంలో వైఫల్యం

  • అవగాహనలో రాజకీయ కార్యకర్తలే మెరుగు

  • రాజధానిలో ఓటొక చోట.. ఉండేది మరోచోట

  • లక్షల మందికి ఏం చేయాలో చెప్పేవారు లేరు

  • ఎంత భారమో, ఎంత కాలమో స్పష్టత లేదు

  • నిమ్మకు నీరెత్తినట్లు బీఎల్‌వోల ప్రవర్తన

  • డెడ్‌లైన్‌ ముంచుకొచ్చాక సంక్షోభ పరిస్థితి

  • ఏ రోజుకారోజు నివేదికలు తెప్పిస్తేనే మంచిది

నేను 20 ఏళ్లుగా ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నా. చాయ్‌, నీళ్లు, స్నాక్స్‌ ఇవ్వడమే నాకు తెలుసు. ఇప్పుడు బీఎల్‌వో డ్యూటీ వేశారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో.. 2002 జాబితాలో పేరు ఎలా చూడాలో నాకు తెలియడం లేదు. సార్‌ నేనీ పని చేయలేనంటే వినిపించుకునే వారు లేరు. మొబైల్‌లో వాట్సప్‌, షార్ట్స్‌, రీల్స్‌ చూడడం వరకు ఓకే.. ఇదంతా ఎలా చేయాలి?

- జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయ సబార్డినేట్‌

హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులైనా బాలారిష్టాలను అధిగమించలేదు. ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలను ముద్రించి ఆయా పోలింగ్‌ బూత్‌ల పరిధిలో పనిచేసే బీఎల్‌వోలకు అందజేయడంలో సంబంధిత యంత్రాంగం విఫలమైంది. కొన్నిచోట్ల బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తుండగా కొన్నిచోట్ల శుక్రవారం కూడా బీఎల్‌వోలు ఫారాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 35,985 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా సర్‌ ప్రారంభించిన తొలిరోజు 8 వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ జరగలేదు. రెండో రోజు శుక్రవారం నాటికీ 4 వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు చేరలేదని తెలుస్తోంది. పర్యవేక్షణా లోపం, సంబంధిత యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బీఎల్‌వోలు చెబుతున్నారు.


ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఓఏలు, మునిసిపాలిటీల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులను బీఎల్‌ఓలుగా నియమించారు. దీంతో వారు తమ సొంత బాధ్యతల్లో కొనసాగుతూ అదనంగా సర్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ సమయంలో ఇంటింటి సర్వే చేపట్టాలి? జూలై 24 వరకు తాము ఇదే పనుల్లో ఉండాలా? లేదంటే రోజువారీ బాధ్యతల్లో కొనసాగుతూ ఈ ప్రక్రియలో పాల్గొనాలా? అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో చాలా మంది సర్‌ ప్రక్రియను సీరియ్‌సగా తీసుకోవడం లేదు. సంబంధిత శాఖల అధికారులు గానీ, ఎన్నికల విభాగాలు గానీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ కారణంగానే రెండో రోజూ ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా సర్‌ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌ఓలు) 35,985 మంది, క్షేత్ర స్థాయిలో బీఎల్‌ఓ సూపర్‌ వైజర్లు 3,596 మంది, రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్‌ లెవల్‌ ఏజెంట్లు(బీఎల్‌ఏలు) 49,018 మంది పాల్గొంటున్నారు. అయితే, రోజువారీగా ఎంతమంది ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేస్తున్నారు? బీఎల్‌ఓలు ఎన్ని ఇళ్లను సందర్శించారన్న వివరాలను వెల్లడించడంలో రాష్ట్రస్థాయి ఎన్నికల విభాగాలు విఫలమవుతున్నాయి. బీఎల్‌ఓల పనితీరును రోజువారీగా అంచనా వేసేందుకు ఎన్ని ఫారాలను సమర్పించారన్న సమాచారాన్ని సీఈఓ కార్యాలయం బహిర్గతం చేయడంలేదు.


సర్‌ ప్రక్రియ సాగుతోందిలా!

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌)లో భాగంగా ఇంటింటి సర్వే రెండో రోజూ కొనసాగింది. ఓటరు పేరుతో ముద్రించిన ఎన్యుమరేషన్‌ పత్రాలను బీఎల్‌ఓలు వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఓటర్లకు పంపిణీ చేశారు. ఒక్కో ఓటరుకు రెండేసి పత్రాలను అందజేసి వివరాలు ఎలా నమోదు చేయాలో వివరించారు. పూర్తయిన చోట ఒకటి తీసుకొని, రెండోదాన్ని రసీదుగా ఓటరుకు అందజేశారు. సర్‌ను పరిశీలించడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీల తరఫున బీఎల్‌ఏలను నియమించుకున్నారు.. వారు బీఎల్‌ఓల వెంట వెళ్తూ ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలను భర్తీ చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ వెళ్తున్న బీఎల్‌ఓలు మొదట 2025 అక్టోబరు అసెంబ్లీ ఓటరు జాబితాలో కుటుంబ సభ్యుల ఓటరు కార్డులను పరిశీలిస్తున్నారు. అందులో పేర్లుంటే, తిరిగి 2002 అసెంబ్లీ ఓటరు జాబితాతో సరిపోల్చుతున్నారు. ఈ రెండు జాబితాల్లో ఉంటే వారు ప్రస్తుతం ఉన్నారా? లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా? బతికి ఉన్నారా లేక చనిపోయారా? రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటే వారిపేర్లను ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. చనిపోయిన వారి పేర్లను అక్కడికక్కడే తొలగించేందుకు మార్క్‌ వేస్తున్నారు.


సాంకేతికత తెలియకున్నా ’సర్‌’ విధులు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఓటర్‌ ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికతతపై కొందరు బీఎల్‌ఓలకు అవగాహన లేకపోవడంతో సర్వేలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీస విద్యార్హత లేని పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల(ఎస్ఎఫ్ఏ)ను బీఎల్‌ఓలుగా నియమించారు. వీరంతా అవుట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో దాదాపు 60 శాతం బీఎల్‌ఓలు అవుట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారే. బీఎల్‌ఓ డ్యూటీ చేయాల్సిందే. లేదంటే ఉద్యోగం పోతుందని అధికారులు చెప్పడంతో భయంతో చేతకాకున్నా భుజాన వేసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులు, విద్యార్హత ఉన్న వారినే బీఎల్‌ఓలుగా నియమించాలి. రోజువారీ పాలనా వ్యవహారాలపై ప్రభావం చూపుతోందన్న ఉద్దేశంతో అవగాహన, విద్యార్హత లేని వారికి బాధ్యతలు అప్పగించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఓ ఎస్‌ఎ్‌ఫఏను బీఎల్‌ఓగా నియమించగా ఆయన తన పని పారిశుధ్య కార్మికురాలితో చేయిస్తున్నారు.


యాప్‌లో చూడలేక

సర్‌ ప్రక్రియ మొత్తం మొబైల్‌ యాప్‌ ద్వారానే జరుగుతోంది. యాప్‌ వినియోగం తెలియని బీఎల్‌ఒలు 2002 జాబితాలోని ఓటర్‌ వివరాలు చూడడంలో యాప్‌లో దరఖాస్తుల్లోని వివరాలు నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వద్ద 2002 జాబితాలోని ఓటర్‌ వివరాలు లేవు. అలాంటి వారికి బీఎల్‌ఓలు సాయం చేయాలి. జిల్లా, అసెంబ్లీ, గ్రామం/ఏరియా, పేరు ఆధారంగా యాప్‌లో సెర్చ్‌ చేయాలి. కొందరు బీఎల్‌ఓలు ఈ పని చేయలేకపోతున్నారు. ఇది ఓటర్‌ మ్యాపింగ్‌పై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో 10వ తరగతి ఫెయిల్‌ అయిన వారినీ బీఎల్‌ఓలుగా నియమించారు. వారు మొబైల్‌ యాప్‌ వినియోగంలో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో పార్టీలు నియమించిన బీఎల్‌ఓలు పాత జాబితాలోని ఓటర్‌ వివరాలు చూడడంలో సహాయ పడుతుండడం గమనార్హం. హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో బీఎల్‌ఓలు విధులకు హాజరు కాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విధుల్లో చేరకుంటే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హెచ్చరించారు.


ఆ చిరునామాల్లో ఓటర్లు లేరు

చిరునామాల ఆధారంగా ఇంటింటికి వెళ్తున్న బీఎల్‌ఓలకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఓటర్‌ జాబితాలో ఉన్న చిరునామాలో కొన్ని కుటుంబాలు ఉండడం లేదు. ప్రతి ఓటర్‌కు ఎన్యూమరేషన్‌ ఫారం ఇవ్వాలి. దాంతో వారికి ఇచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో ఇంకొన్ని కుటుంబాలకు ప్రస్తుతం ఉంటున్న చిరునామాలో ఓటు లేదు. ఆ కుటుంబాలూ ఆందోళన చెందుతున్నాయి. మా పాత చిరునామాలో ఓటు ఉంటుందా? దాన్ని కాపాడుకోవడానికి చేయాలని విజిట్‌కు వచ్చిన బీఎల్‌వోలను అడుగుతున్నారు. ఓటు హక్కు ఉన్న చోటే ఫారం ఇస్తారని, అక్కడే నింపి ఇవ్వాలని బీఎల్‌వోలు సూచిస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మహానగరంలో 70 శాతం మంది అద్దె ఇళ్లలో నివసిస్తారు. వివిధ కారణాలతో ఇళ్లు, ప్రాంతాలు మారుతుంటారు. ప్రతి చోట ఓటర్లుగా పేరు నమోదు చేసుకుంటారు. ఒకచోటే ఓటేస్తారు. నగరంలో తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. సర్‌ ప్రీ సర్వేలోనూ 46 శాతం మాత్రమే మ్యాపింగ్‌ జరగడం ఇందువల్లే అని ఓ అధికారి చెప్పారు. శుక్రవారం 100 మంది ఫారాలు తీసుకెళ్తే 40 మందికే ఇవ్వగలిగానని సనత్‌నగర్‌లో బీఎల్‌ఓ తెలిపారు.

Updated Date - Jun 27 , 2026 | 06:32 AM