రాజ్యసభకు సింఘ్వీ, వేం ఏకగ్రీవం!
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:36 AM
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక కావడం ఇక లాంఛనమే.
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక కావడం ఇక లాంఛనమే. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా.. శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు మాత్రమే రేసులో నిలిచారు. రాజ్యసభ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఒక అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలు ఉండాలి. నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థికి అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఆ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. దీంతో బరిలో ఇద్దరే మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో ఎవరినీ బరిలో నిలపలేదు.
9న అధికారిక ప్రకటన
నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారి సింఘ్వీ, నరేందర్‌రెడ్డిల ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. సీనియర్ న్యాయవాది సింఘ్వీ రెండోసారి రాజ్యసభలో అడుగు పెడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి మొదటిసారి పెద్దల సభకు వెళ్తున్నారు.