గాయని మంగ్లీపై కేసు
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:48 AM
ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. తన సోదరుడు, మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగ్లీ పలువురిని మోసం చేశారని, బాధితుల ...
పంజాగుట్ట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. తన సోదరుడు, మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగ్లీ పలువురిని మోసం చేశారని, బాధితుల తరఫున కేసు తీసుకున్నందుకు తనను చంపుతామన్నారంటూ తార్నాక విజయపురి కాలనీకి చెందిన సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే న్యాయవాది సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంగ్లీ నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను పర్సనల్‌గా కలవాల్సిందిగా అడిగారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు, న్యాయవాది సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాన్, పాల్ అలియాస్ శైలజ చౌహాన్, మంగ్లీ సోదరుడు శివ, సింగర్ మంగ్లీ (సత్యవతి) తదితరులు గోకుల నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సూక్ష్మ రుణాలు, కోకాపేటలో పబ్, రెస్టారెంట్, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీలు తదితర వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించారు. హేమకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తిరుమల్ తదితరుల వద్ద నుంచి రూ.9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేశారు. మరో 100 నుంచి 200 మంది నుంచి కూడా ఇలా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల దాకా వసూలు చేశారు. కానీ, లాభాలు ఇవ్వకపోగా.. అసలు కూడా తిరిగి ఇవ్వడంలేదని, మంగ్లీ ప్రచారం చేయడంతోనే బాధితులు డబ్బులు కట్టారని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని చెప్పారు. కొంతమంది బాధితులు తనను కలవడంతో కేసు చేపట్టానని, అయితే దర్శకుడు వేణు ఊడుగుల, న్యాయవాది పి.నాగేశ్వరరావు తనను కలిసి మాట్లాడారని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. ఆ తరువాత కేసు ఉపసంహరించుకోవాలంటూ నిందితులు తనపై ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించడంతో చంపుతామని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నిందితులపై బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 351(2), 352ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు న్యాయవాది సుబ్బారావుపై గాయని మంగ్లీ నార్సింగ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన తనను పర్సనల్‌గా కలవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు తాను అంగీకరించకపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.