Share News

సింగరేణిని ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:35 AM

తెలంగాణ ప్రజలకు గుండె లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.

సింగరేణిని   ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదు
sreedharbabu

  • బొగ్గు మాయంపై ఆధారాలుంటే బీఆర్‌ఎస్‌ బయటపెట్టాలి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు గుండె లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటుపరం కాకుండా గతంలో కాపాడింది, ఇప్పుడు కాపాడుతున్నది, భవిష్యత్తులో కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. సింగరేణి అంశంలో బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సీఎల్పీ మీడియా హాల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కీలకమైన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు సంస్థకు దక్కలేదని శ్రీధర్‌ బాబు గుర్తు చేశారు. దాని వల్ల ఏటా 10 మిలియన్‌ టన్నుల నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేేస అవకాశాన్ని సింగరేణి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామన్నారు. సింగరేణికి కొత్త గనులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఖనిజాలు, థర్మల్‌, సౌర విద్యుత్‌ రంగాల్లో సింగరేణి విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. సింగరేణిలో బొగ్గు మాయం అంటూ బురద జల్లుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. ఆధారాలుంటే బయటపెట్టాలని సూచించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టి, సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. యాదాద్రి ప్లాంటును సాంకేతిక లోపాలతో మూలన పడేలా చేసిందన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 05:35 AM